అప్పుడు కౌగిలింత.. ఇప్పుడు కవ్వింత
ఉప ఎన్నికల్లో లబ్ధికోసమే డ్రామాలు: దాసోజు
సీఎం కేసీఆర్, జగన్‌లు ఇప్పుడే ఎందుకు డ్రామాలు
హుజూరాబాద్ ఎన్నికల కోసం రెండు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా?
జగన్, కేసీఆర్ డ్రామాలకు ఎవరూ బలికావొద్దు: దాసోజు శ్రవణ్
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): నదీ జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావాలనే డ్రామా చేస్తున్నారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఏపీ సీఎంవైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా రెండు ప్రాంతాల ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. ఇద్దరూ నటనలో రావుగోపాల్ రావు, అమ్రిష్ పురిలను మించిపోయారన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో శనివారం దాసోజు మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య నడుస్తున్న జల జగడం అంతా పెద్ద డ్రామా అన్న విషయం గతంలో జరిగిన విషయాలను గమనిస్తే అర్థమవుతుంది. రాయలసీమకు వెళ్లినప్పుడు కేసీఆర్ రతనాల సీమ చేస్తాన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించేందుకు కేసీఆర్ డబ్బులు పంపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ పిలిచారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకంగా కేసీఆర్ కాళ్లక మొక్కారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు. జగన్, కేసీఆర్ డ్రామాలకు ఎవరూ బలికావొద్దని కోరుతున్నానన్నారు. ఒకరికొకరి స్వీట్లు తినిపించుకున్న కేసీఆర్, జగన్‌లు ఇప్పుడే ఎందుకు డ్రామాలు ఆడుతున్నారో గుర్తించాలన్నారు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ డ్రామాలు” అని దాసోజు శ్రవణ్ అన్నారు.

