ఆదర్శంగా నిలుస్తారనుకుంటే..అవినీతికి పాల్పడతారా?
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన జగిత్యాల ఎస్సై
జగిత్యాల, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలను అరికట్టాల్సిన పోలీసు అధికారే అక్రమార్జనకు పాల్పడడంపై సమాజంలో యువత, మేధావులు భగ్గున మండిపడుతున్నారు. మరో పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి లంచం తీసుకుంటూ ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. జగిత్యాల పట్టణంలో గురువారం జరిగిన ఏసీబీ దాడి ఘటన సంచలనం సృష్టించింది. జగిత్యాల టౌన్ ఎస్సై శివకృష్ణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడిన వైనం పోలీసు శాఖలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే… భార్యాభర్తల కుటుంబ కలహాల విషయంలో స్టేషన్ బెయిల్ కు సంబంధించి ఎస్సై శివకృష్ణ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. తాము అంత డబ్బు ఇచ్చుకోలేమంటే పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక రాజేష్ అనే బాధిత వర్గానికి చెందిన వ్యక్తి కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలియజేశాడు. ఏసీబీ అధికారులు అభయం ఇచ్చారు. ఈలోగా ఎస్సై శివకృష్ణ ఓ మెట్టు దిగి రూ.30 వేలు ఇవ్వమని అడిగారు, ఈ విషయం రాజేష్ వెంటనే ఏసీబీ అధికారులకు తెలియజేయగా.. వారిచ్చిన రూ.30 వేలు తీసుకుని జగిత్యాలకు వచ్చాడు. గురువారం రూ.30 వేలు లంచం డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కరీంనగర్ డీఎస్పీ భద్రయ్య నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఎస్సై శివకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శివకృష్ణ ఇటీవలే బదిలీపై జగిత్యాలకు వచ్చారు. ఇంతకుముందు కొడిమ్యాలలో పనిచేస్తున్నప్పుడు ఇదే తరహాలో వివాదాస్పదంగా వ్యవహరించడంతో స్థానికంగా దుమారం చెలరేగి వివాదాస్పద రీతిలో బదిలీ అయ్యాడు. జగిత్యాలకు వచ్చినా తన ధోరణి మార్చుకోలేదు. ముగిసిన కేసులో మళ్లీ బాధితులను పిలిపించి బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖతోపాటు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
