ఈటల రాజకీయ జీవితానికి చెక్.. సిఎం కేసీఆర్ భారీ వ్యూహాలు
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈటల రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. ఈటల రాజీనామాతో ఆరు నెలల్లోగానే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు సవాల్ చేస్తున్న,ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనుండడంతో ఆయనను ఓడించి ఆయన రాజకీయ జీవితానికి చెక్‌పెట్టాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం భావిస్తున్నది. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అధికార పక్షానికే విజయావకాశాలు ఎక్కువ గా ఉంటాయన్న భావన ఉన్నా దుబ్బాక పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారని సమాచారం.

పార్టీలో ఈటల లాగా మరెవరూ ధిక్కారస్వరం వినిపించకుండా ఉండేందుకు ఆయనను ఓడించడం ద్వారా గట్టి హెచ్చరికలు పంపించాలని అధిష్ఠానం భావిస్తున్నది. అందుకే ఈటలపై బలమైన అభ్యర్థిని పోటీకి నిలపాలని భావిస్తున్నది. వీటన్నిటి నేపథ్యంలో టీఆర్‌ఎస్, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే అభ్యర్థిగా నిలిపేందుకు మొగ్గుచూపవచ్చనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్నది. అలాంటి సందర్భంలో ప్రవీణ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డిలో ఎవరికైనా అవకాశం లభించవచ్చు. కొత్త పేర్లు కూడా ప్రతిపాదనలోకి వచ్చే అవకాశం లేకపోలేదు
