ఉక్రెయిన్ లో భీకర యుద్ధం.. భారీ విధ్వంసం
పలు పట్టణాలపై బాంబుల వర్షం
శకలాలు, మంటల్లో నగరాలు
ఎక్కడ చూసిన భీతావహ దృశ్యాలు
నగరాల దురాక్రమణలో రష్యా దూకుడు
దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్లు
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్/కీవ్ : ఉక్రెయిన్ పై రష్యా దాడులు పన్నేండో రోజు కూడా భీకరంగా కొనసాగాయి. పలు కీలక నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మరికొన్ని నగరాలపై రష్యా సైనికులు బాంబు దాడులతో, క్షిపణిలతో, రాకెట్ లతో విరుచుకుపడుతున్నారు. జనావాసాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఉక్రెయిన్ లోని పలు నగరాల్లో భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం సరిహద్దు దేశాలకు వలస బాట పట్టారు.

తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకారివ్ లోని ఓ బేకరిపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. దీంతో ఆ సమయంలో బేకరి వద్ద ఉన్న దాదాపు 30 మందిలో 13 మంది మృత్యువాత పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు శిథిలాల క్రింద చిక్కుకున్న మరో ఐదుగురిని రక్షించారు. పన్నెండు రోజులు భీకర దాడులు కొనసాగిస్తున్న రష్యా సైనికులను అంతే ధీటుగా ప్రతిఘటిస్తుంది ఉక్రెయిన్ సైన్యం. ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాడుతున్న ఉక్రెయిన్ దైర్య సాహసాలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.

