January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

గాల్లో క‌రోనా వైర‌స్ ఎంత దూరం ప్ర‌యాణిస్తుందో తెలుసా?

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ ( corona virus ) గాలి ద్వారా వ్యాపిస్తోంద‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా స్ప‌ష్టం చేసింది. అస‌లు క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ మాస్కులు వేసుకోండి, భౌతిక దూరం పాటించండి, ఎక్కువ‌గా గుమికూడ‌కండి అన్న సూచ‌న‌లు అన్ని ప్ర‌భుత్వాలూ చేస్తూనే ఉన్నాయి. మ‌నిషికి, మ‌నిషికి క‌చ్చితంగా ఇంత దూరం ఉండాల్సిందే అన్న సూచ‌న కూడా వైర‌స్ గాల్లో ప్ర‌యాణించే దూరాన్ని బ‌ట్టే అంచ‌నా వేశారు. మ‌రి క‌రోనా వైర‌స్ పార్టిక‌ల్స్ అస‌లు గాల్లో ఎంత దూరం ప్ర‌యాణిస్తాయి? వైర‌స్ వ్యాప్తి నాలుగు గోడ‌ల మ‌ధ్య ఎక్కువ‌గా ఉంటుందా లేక బ‌య‌ట‌నా? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు చూద్దాం.

గాల్లో వెళ్లే దూర‌మెంత‌?
క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ క‌నీసం రెండు మీట‌ర్ల భౌతిక దూరం పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. వైర‌స్ సోకిన వ్య‌క్తి ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చే వైర‌స్ పార్టిక‌ల్స్ రెండు మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ల‌లేవు. ఆ త‌ర్వాత అవి భూమి గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి వ‌ల్ల కింద ప‌డిపోతాయి. అలా ప‌డిన ఉప‌రిత‌లంపై వైర‌స్ 3 నుంచి 4 గంట‌ల పాటు ఉంటుంది. ఇలా ఇన్ఫెక్ట్ అయిన ప్రాంతాల‌ను ఫోమైట్స్ అంటారు.

అయితే వైర‌స్ సోకిన వ్య‌క్తి మాట్లాడిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు, ద‌గ్గిన‌ప్పుడు, శ్వాస తీసుకున్న‌ప్పుడు తుంప‌ర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అందులో కొన్ని పెద్ద‌వి ఉంటాయి. అవి రెండు మీట‌ర్ల కంటే ఎక్కువ వెళ్ల‌లేవు. కానీ ఏరోసోల్స్‌గా పిలిచే కొన్ని వేల సంఖ్య‌లో సూక్ష్మ తుంప‌ర్లు రెండు మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ల‌గ‌ల‌వు. దీనినే గాలి ద్వారా వ్యాప్తి చెందే వైర‌స్‌గా పిలుస్తున్నారు. ఈ ఏరోసోల్స్ గాల్లో 18 అడుగులు అంటే 5.5 మీట‌ర్ల వ‌ర‌కూ కూడా ప్ర‌యాణించ‌గ‌ల‌వ‌ని ఒక అధ్య‌య‌నం తేల్చింది.

నాలుగు గోడ‌ల మ‌ధ్యే ప్ర‌మాదం ఎక్కువ‌
నిజానికి ఈ గాలి ద్వారా వ్యాపించే వైర‌స్ నాలుగు గోడ‌ల మ‌ధ్యే ఎక్కువ ప్ర‌మాద‌కారి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స‌రైన వెంటిలేష‌న్ లేని ప్రాంతాల్లో ఒక గ‌ది నుంచి మ‌రో గ‌దిలోకి కూడా ఈ ఏరోసోల్స్ వెళ్ల‌గ‌ల‌వు. అందుకే పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తి ఉంటే ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెమినార్ హాల్స్‌, కాన్ఫ‌రెన్స్ గ‌దులు, హాస్పిట‌ల్ వార్డులు, ఇంట్లో స‌రైన వెంటిలేష‌న్ లేని గ‌దుల్లో ఇవి ఐదారు మీట‌ర్ల వ‌ర‌కూ వెళ్ల‌గ‌ల‌వు.

బ‌య‌ట ఎందుకు సేఫ్‌?
నిజానికి నాలుగు గోడ‌ల మ‌ధ్య కంటే బ‌య‌టే వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌క్కువ‌. క‌నీసం రెండు మీట‌ర్ల దూరం, మాస్కులు పెట్టుకుంటే బ‌య‌ట వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌క్కువగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనికి ఓ కార‌ణం ఉంది. బ‌య‌టి వాతావ‌ర‌ణంలో తాజా గాలి, సూర్య కిర‌ణాలు ఈ ఏరోసోల్స్‌ను త్వ‌ర‌గా చంపేస్తాయి. గాల్లోని క‌రోనా వైర‌స్ పార్టిక‌ల్స్‌లో 90 శాతాన్ని సూర్య కిర‌ణాలు ఏడు నిమిషాల్లోపే చంపేసిన‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది.

బ‌య‌ట కూడా మ‌రీ ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లోనే కొవిడ్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంటోందన్న విష‌యాన్ని గ‌మ‌నించాలి. అందుకే ఎక్కువ మంది గుమికూడ‌ద‌ని, పెళ్లిల్లు, అంత్య‌క్రియ‌ల‌కు భారీగా జ‌నం హాజరు కావ‌ద్ద‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. అమెరికాకు చెందిన సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) ప్రకారం.. రెండు మీట‌ర్ల కంటే ఎక్కువ దూరం గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి ఇండోర్స్‌లోనే ఎక్కువ‌గా ఉంటుంది.

అది కూడా వెంటిలేష‌న్ స‌రిగా లేని గ‌దుల్లో ఇది మ‌రీ ఎక్కువ‌. బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా ప్ర‌తి వ్య‌క్తికీ రెండు మీట‌ర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండ‌టం, నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉన్న‌ప్పుడు అక్క‌డున్న వ్య‌క్తుల్లో అంద‌రూ నెగ‌టివో కాదో తెలియ‌న‌ప్పుడు మాస్కులు క‌చ్చితంగా పెట్టుకోవ‌డం వ‌ల్ల ఈ గాలి ద్వారా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని సీడీసీ స్ప‌ష్టం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.