తమ్ముడు అంటూనే ఓడించాలని చూశారు.!
పదవుల కోసం పెదాలు మూస్తే, నాకు పదవి ఉండేది
18 ఏళ్లు కుడి భుజంగా పనిచేశా.. అర్థగంటలోనే దయ్యం అయ్యానా?
నాకు టికెట్ ఇచ్చినోళ్లే ఘోరంగా ఓడించాలని చూశారు: ఈటల సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ పై ఈటల ఒంటి కాలిపై భగ్గున మండిపడుతున్నారు. కేసీఆర్ కుటిల బుద్ధిని ప్రదర్శించారని 18 ఏళ్లపాటు ఎన్నో ఆటుపోట్లకు భరించి, పార్టీ స్థాపన, ఉద్యమ కాలం నుంచి కుడి భుజంగా ఉంటూ రాష్ట్ర సాధన కోసం అహోరాత్రులు పనిచేస్తున్న తనకు, టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి ఘోరంగా డిపాజిట్ రాకుండా ఓడించాలని చూశారంటూ చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ నేత ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మరో మారు సీఎం కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా కుడి భుజంగా ఉన్న తాను అర్థగంటలోనే ఎలా దయ్యాన్నయ్యానని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్రలేదా? ఎక్కడ తిన్నామో, ఎక్కడ పడుకున్నామో కేసీఆర్‌కు తెలియదా? అన్నారు. కరీంనగర్ మంత్రి జైలుకు వెళ్లారా? లేక తాను జైలుకు పోయానా? సీఎం తెలియదా? అన్నారు. అధికార పార్టీలో ఉన్నా తన ఇంటిపై పోలీసులతో దాడి చేయించారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డు ఇవ్వాలని చెప్పానని అదేమన్నా తప్పా అని ప్రశ్నించారు. రేషన్ కార్డు ఇవ్వలేని మంత్రి పదవి ఎందుకని భావించానన్నారు. రైతుబంధు ఇవ్వాలని అయితే గుట్టలకు, ఉపయోగంలేని భూములకు, భూస్వాములకు ఇవ్వొద్దని చెప్పానన్నారు. పదవుల కోసం పెదాలు( నోరు) మూస్తే తనకు పదవి ఉండేదని ఈటల రాజేందర్ వ్యాఖ్యనించారు. ఈటల తాజా వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ టీఆర్ఎస్, కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

