త్రిబుల్ర్ ఆర్.. సస్పెండ్ ఓ భారీ కుట్ర
ప్లాన్ ప్రకారమే చేసిండ్రు
గతంలో రేవంత్ ను ఇట్లే బయటికి పంపిండు
బడ్జెట్ లో లెక్కల గారడీ.. ఏమి లేదు
బీజేపీ ఛీప్ బండి సంజయ్ విమర్శలు
హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసేందుకు కుట్ర చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలోనూ ఏ కారణం లేకుండా రేవంత్ రెడ్డిని కూడా కేసీఆర్ ఇట్లేనని చేసిండని బండి సంజయ్ గుర్తుచేశారు. మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతుంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మురిసి పోయారని ఆయన విమర్శించారు.

అంతకుముందు 270 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కానరాకుండా పోయిందని ఆ గతి గులాబీ పార్టీకి పడుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని అదీ జరగడం సాధ్యంకాదన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి అని, సభకు ఎలాంటి ఆటంకం కలిగించకపోయినా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. ఓ మహిళా గవర్నర్ అని చూడకుండా అసెంబ్లీకి రాకుండా అవమానించిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల చరిత్రలో గవర్నర్ ప్రసంగం లేకుండా ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయా అని నిలదీశారు. హరీష్‌రావు బడ్జెట్ లో లెక్కల గారడీ తప్ప ఏమీ లేదని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అలానే రాష్ట్ర బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. అబద్దాల బడ్జెట్ అని.. గత బడ్జెట్‌లో కేటాయించింది ఎంత ఖర్చు చేశారో స్పష్టం చేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు ఎన్ని రోజులు అడ్డుకున్నారో చెప్పాలని.. అక్కడ టీఆర్ఎస్ ఎంపీలు పోడియం దగ్గర ఆందోళన చేశారని అడిగారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా లోక్ సభలో ఆందోళన చేశారని అదీ మరచిపోవద్దని వివరించారు. సీఎం కేసీఆర్‌కే అసెంబ్లీలో కూర్చునే అధికారం లేదని బండి సంజయ్ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్స్ పై గవర్నర్‌ను అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని ఆయన వెల్లడించారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
