అన్ని బట్టేబాజ్ మాటలే..
ఉప ఎన్నికలతో కలెక్షన్లు.., కాళేశ్వరంతో కలెక్షన్లు
ప్రాణాలు తీయడం.. పాడె మోయడం కేసీఆర్ నైజం
రానున్న రోజుల్లో ప్రజల చేతిలో కేసీఆర్ రాజకీయ జీవితం ఖతమే
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని… సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందన్నారు. బట్టేబాజ్ మాటలు చెపుతున్న కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెపుతారన్నారు. ప్రాణాలు తీయడం పాడె మోయడం కేసీఆర్ నైజమని అంజన్ కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమంలో ఉప ఎన్నికలతో కలెక్షన్‌లు, ఇప్పుడు కాళేశ్వరంతో కలెక్షన్‌లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో పుట్టి, రెండు సార్లు ఎంపీగా పనిచేసిన తనకే పెట్రోల్ పైసలకు కష్టం అవుతోందని ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఈ ఏడేళ్లలో కేసీఆర్‌కు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు కొట్టాలని చూస్తున్నారని అంజన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ భవిష్యత్ రాజకీయ జీవితం ఇక ఖతమేనన్నారు. ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఈ నెల 7న గాంధీభవన్‌లో కొత్త కమిటీ బాధ్యతలు చేపడుతుందన్నారు. తాను ఉజ్జయిని మహంకాళి రేవంత్ రెడ్డి పెద్దమ్మ ఆలయాల్లో పూజలు చేసి భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా అంజన్ కుమార్ తెలిపారు.
