బ్యాంక్ మేనేజర్ అనూష ఆత్మహత్య..బందువుల అనుమానాలు
హైదారాబాద్/హన్మకొండ : హన్మకొండ జిల్లాలోని బ్యాంక్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. హన్మకొండలోని ఓ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్న అనూష ఆత్మహత్యకు పాల్పడింది. గర్భిణీగా ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అనూష ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు భర్త ప్రవీణ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్త చంపారంటూ ఆరోపిస్తున్నారు. అనూషది ముమ్మాటికి ఆత్యహత్య కాదు? హత్య అంటూ కేయూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గతం కొంత కాలంగా భర్త ప్రవీణ్ వరకట్న వేదింపులు ఎక్కువయ్యాయని, అందుకే ప్రవీణ్ ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటారని మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

యూనియన్ బ్యాంక్‌లో మేనేజర్ గా పని చేస్తున్న అనూషకు, అదే బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పనిచేసే ప్రవీణ్‌తో 2019లో వివాహం అయ్యింది. అనూషది కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం కాగా… భర్త ప్రవీణ్‌ది భీమదేవరపల్లి మండలం మల్లారం. వివాహ సమయంలో 25 లక్షల రూపాయలను వరకట్నంగాను, బంగారు ఆభరణాలు ఇచ్చామని చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం మృతురాలు అనూష యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తోంది. అనూష పైన తీవ్రమైన అనుమానం పెంచుకున్న భర్త ప్రవీణ్ నిత్యం ఆమెను మానసికంగా శారీరకంగా వేధించేవాడని ఆమే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనూష పనిచేసే బ్యాంకులో తోటి సిబ్బందితో మాట్లాడినా అనుమానం పెంచుకుని నిత్యం వేధించే వాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేయూ పీఎస్ లో ఫిర్యాదు చేయగా… సరిగా స్పందించకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళన తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక కేయూ పోలీసులు తెలిపారు. మృతురాలు అనూష బందువుల ఫిర్యాదుతో భర్తపై విచారణ చేపడతామని వారికి హమీ ఇచ్చారు.
