January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

మాతృత్వ మరణాలు అమానవీయ చర్య

మాతృత్వ మరణాల రేటు తగ్గాలి ..వైద్యులకు గవర్నర్ సూచన

మరణాల రేటు పెరగడంపై గవర్నర్ ఆవేదన

కోవిడ్ పేరుతో చికిత్స నిరాకరించొద్దు.. భరోసానిచ్చేలా వైద్యులు సహకరించాలి

మాతృత్వ మరణాలు అమానవీయ చర్య

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : అవగాహన, సరైన వైద్య సదుపాయాలు, సహాయంతోనే మాతృత్వ మరణాల రేటును తగ్గించవచ్చని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సరైన పోషకాహారం, సమతులాహారం, సమయానుకూల వైద్య సేవలు, ఆసుపత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించడంతో మాతృత్వ మరణాల రేటును చాలావరకు తగ్గించవచ్చని గవర్నర్ స్పష్టం చేశారు.సేఫ్ మదర్ హుడ్ వీక్ సందర్బంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమిళనాడు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ సంక్షోభ సమయం మాతృత్వ మరణాల రేటు పెరుగుదలకు కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పేరుచెప్పి ఏ ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా వైద్య సదుపాయాలు, వైద్య సహాయం నిరాకరించకూడదని గవర్నర్ స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లోనే గర్భిణీ స్త్రీలకు మరింత భరోసా ఇచ్చేలా ఆసుపత్రులు, వైద్యులు వ్యవహరించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. వైద్యం నిరాకరించి, గర్భిణీ స్త్రీల మరణాలకు కారణం కావడం అమానవీయ చర్య అని గవర్నర్ అన్నారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మాతృత్వ మరణాలను తగ్గించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇప్పటికీ ఎక్కువగానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోషకాహార స్థాయిలను పెంపొందించడం, క్రమానుగతంగా వైద్య సేవలు అందించడం, ఆస్పత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా ఈ మరణాలను తగ్గించవచ్చని డాక్టర్ తమిళిసై అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు అడిగిన ఒక ప్రశ్నకు స్పందనగా ఇన్ ఫర్టిలిటీ సమస్యలకు మహిళలను బాధ్యులను చేయడం, పిల్లలు లేని వారి పట్ల వివక్ష చూపడం అమానవీయ మని గవర్నర్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.