January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

రెండు దశాబ్దాలు.. ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు

  • మాకు తిరుగేలేదు: మంత్రి కేటీఆర్
  • రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం టీఆర్ఎస్ దే
  • హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్న విషయం
  • సెప్టెంబర్ 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయ భూమి పూజ
  • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): హుజురాబాద్ ఉప ఎన్నిక తమకు చాలా చిన్న విషయమనీ, నోటిఫికేషన్ వచ్చాక గెలుపు దిశగా వ్యూహ రచన చేస్తామని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం టీఆర్ఎస్ దేనని స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రధానంగా రెండు అంశాలపై చర్చించామనీ, సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందని చెప్పారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ కమిటీల నిర్మాణం, వార్డు కమిటీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారనీ మండల, మున్సిపల్, పట్టణ, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సంవత్సరంలోనే నవంబర్ లేదా అక్టోబర్ చివరిలో ద్విశతాబ్ది ఉత్సవ సభ నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు .అలాగే, 32 జిల్లాలలో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ అక్టోబర్ లో విజయదశమికి అటు ఇటుగా ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే, నవంబర్ మొదటి వారంలో టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెండు దశాబ్దాల్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు సాధించామనీ, శాసనసభ ఎన్నికల నుంచి జిల్లా పరిషత్, మున్సిపల్, గ్రామ పంచాయతీ అన్ని ఎన్నికలలో టీఆర్ఎస్ చిరస్మరణీయమైన విజయాలను సాధించిందని చెప్పారు. అన్ని రంగాలలో అభివ్భద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నదనీ, ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. సిద్దిపేటలో దళిత జ్యోతి ప్రారంభించిన సీఎం కేసీఆర్ అదే స్ఫూర్తితో దళిత బంధు పథకం తీసుకొచ్చారనీ, ఈ పథకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు విస్త్భతంగా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన కమిటీ సమావేశంలో రాలేదనీ, నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఎన్నిక గురించి చర్చ జరుపుతామని చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికను మిగతా ఉప ఎన్నికలను చూసినట్లే చూస్తామనీ,హుజురాబాద్ ఎన్నిక వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయేది లేదు…కేంద్రం లో ప్రభుత్వం మారేది లేదన్నారు. ఈటల రాజేందర్ కు ముందు కూడా పాత కమలాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉందనీ, ఈటల రాజేందర్ 2003 లో టీ ఆర్ ఎస్ లో చేరారు ..అప్పటికే అక్కడ స్థానిక ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ గెలిచిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇన్ని సంవత్సరాలలో టీఆర్ఎస్ ఎన్నో ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కొన్నదని స్పష్టం చేశారు. కొంత మంది కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారనీ, సీఎం కేసీఆర్ ది బలహీనమైన గుండె కాదనీ, ధైర్యంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినట్లే దళిత బంధు తీసుకొచ్చారని పేర్కొన్నారు. పనికిమాలిన ప్రతిపక్షాలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయనీ, ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టిన దళిత బంధు పథకంలో పాల్గొనాలని సూచించారు. ఎప్పుడు ఏ పథకం అమలు చేయాలో ప్రభుత్వానికి తెలుసనీ, ప్రజలకు అవసరం ఉన్నప్పుడే అభివ్భద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 88 సీట్లు సాధించామనీ, 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 స్థానాలు కైవసం చేసుకున్నామనీ, టీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.