వైద్యులే లోక రక్షకులు: గవర్నర్
- క్లిష్ట సమయంలో తెగించి వైద్యం.. ప్రాణం పోస్తున్న డాక్లర్లు
- వైద్యుల త్యాగంతో కోట్లాది మందికి పునర్జన్మ
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి); ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో అసమానమైన, నిస్వార్థ సేవలందిస్తున్న వైద్యులే ఇప్పుడు నిజమైన ప్రాణ, లోక రక్షకులు అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో గవర్నర్ ఈ రోజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ. . తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు లక్షలాదిమంది బాధితుల జీవితాలను రక్షిస్తున్నారు అని అన్నారు.

వారి నిస్వార్ధమైన సేవలు, శ్రద్ధ, అంకితభావం లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయని గవర్నర్ వైద్యుల సేవలను కొనియాడారు. వైద్యుల దినోత్సవం వారికి కృతజ్ఞతలు చెప్పడానికి, వారి సేవలను గుర్తించి గౌరవించడానికి ఒక సరైన సమయం గా ఉంటుందని డాక్టర్ తమిళిసై అన్నారు. తాను తన కుటుంబ సభ్యులు వైద్యు లే కావడం వల్ల.. వైద్య రంగంలో ఉన్న వారి ఆలోచనలు, బాధలు బాధ్యతలు అర్థం చేసుకోగలమని, వైద్యులకు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని గవర్నర్ అన్నారు.
భారతరత్న డాక్టర్ బీసీ రాయ్ జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవం గా జరుపుకుంటున్న సందర్భంలో ఆయనకు గవర్నర్ నివాళులు అర్పించారు. వైద్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
