వ్యాక్సిన్ మిక్సింగ్ తో కరోనా కొత్త వైరస్ కు చెక్: డా.రణదీప్ గులేరియా
భయాలు ఉండవు అంటున్న ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా
న్యూఢిల్లీ, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): డెల్టా ప్లస్ లాంటి కొత్త కరోనా వేరియంట్లపై టీకాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న భయాల నడుమ ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రెండు వేర్వేరు టీకాలను వేసుకోవడం(వ్యాక్సిన్ మిక్సింగ్) ద్వారా వేరియంట్లకు చెక్ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ”వేగంగా వ్యాపించే డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లను వ్యాక్సిన్ మిక్సింగ్ ద్వారా ఎదుర్కోవచ్చు. అయితే.. ఈ విధానాన్ని అనుమతించేందుకు మరింత సమాచారం కావాలి. ఈ విషయమై జరిగిన తొలి దశ అధ్యయనాలు..వేరియంట్లకు వ్యాక్సిన్ మిక్సింగ్ చెక్ పెట్టగలదని సూచించాయి. కాబట్టి.. ఏయే టీకాలు వేయాలనేదానిపై మరింత అధ్యయనం జరగాలి. వేర్వేరు టీకాల వినియోగం వల్ల వ్యాక్సిన్ ప్రభావశీలత కచ్చితంగా పెరుగుతుంది” అని ఆయన తెలిపారు. రెండు భిన్నమైన కరోనా టీకాలను ఇవ్వడం ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త టీకా విధానంలో భాగంగా కేంద్రం ఈ విషయాన్నితెలిపింది. ఏయే టీకాలను కలపాలనేది ప్రభుత్వ నిపుణుల నిర్ణయిస్తారని పేర్కొంది. ఇక కొత్త వేరియంట్లపై ప్రస్తుతమున్న టీకాలు పనిచేయకపోవచ్చన్న వార్తలను డా. రణదీప్ గులేరియా గతంలోనే తోసిపుచ్చారు. ఈ విషయాలను నిర్ధారించేందుకు అదనపు సమాచారం కావాలని ఆయన స్పష్టం చేశారు.
