కోవిడ్ కొత్త లక్షణాలు తెలుసుకొండి
కోవిడ్‌పై అపోహలు, అపనమ్మకాలు బాగా పెరిగిపోయాయి. స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ కొందరు, గూగుల్‌లో శోధించి ఇంకొందరు సొంతంగా కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అవసరం లేకపోయినా కొందరు సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్ద బారులుదీరుతున్నారు. కొందరైతే స్వల్ప లక్షణాలున్నా, తమకు ఏదో అవుతుందనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రో ఎంటరాలజీ.. ఏఐజీ నిపుణుల బృందం ఒక మార్గదర్శినిని రూపొందించింది. ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జి.వి.రావు దీనిని విడుదల చేశారు.
కరోనా లక్షణాలపై ఇంకా చాలామందికి అనుమానాలున్నాయి. తొలి విడతలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి దగ్గు మాత్రమే ఉండేవి. రెండో విడతలో వీటితో పాటు అనేక కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. అవి.. జ్వరం, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, చలి జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవటం, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, వాంతులు, విరేచనాలు, ఇందులో ఒకటి లేదా అంతకుమించిన లక్షణాలు ఉంటే కొవిడ్‌గా అనుమానించాలి. వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి, ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. పాజిటివ్‌గా తేలితే చికిత్స ప్రారంభించాలి.