అతలాకుతలం చేస్తున్న వర్షాలు
1 min readహైదరాబాద్: వర్షాలు ఊపందుకోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చిచేరుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ (Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు (Kadem Project) 4280 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయంలో ప్రస్తుతం 689.42 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. ఇక స్వర్ణ ప్రాజెక్టుకు (Swarna Project) 890 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 1164 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1189 అడుగులుగా ఉంది.
భారీ వర్షాలతో కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 1500 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1388.32 అడుగుల వద్ద ఉన్నది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా మాధవ్‌నగర్‌లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో నిజామాబాద్-డిచ్‌పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వాహనాలను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం (Kaleshwaram) పుష్కరఘాట్ వద్ద గోదావరి (Godavari) నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన భారీ వర్షాలతో ప్రస్తుతం 8.25 మీటర్ల ఎత్తులో నది పరుగులుపెడుతున్నది. ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) వర్షాల వల్ల ములుగు జిల్లాలోని పాలెం వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో 21 గేట్లు ఎత్తి 49,244 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరి నదిలోకి విడుదల చేశారు. కాగా, భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 26.7 అడుగుల వద్ద ప్రవహిస్తున్నది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించింది
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద కొనసాగుతున్నది. సింగూరు ప్రాజెక్టుకు ప్రస్తుతం 2847 క్యూసెక్కుల వరద వస్తుండగా, 405 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. జలాశయం పూర్తి నీటిసామర్థ్యం 29.917 టీఎంసీలు. ప్రస్తుతం 18.640 టీఎంసీలకు చేరుకున్నది.