దేవుడితో ఆటలా? వైసీపీ నాయకులవన్నీ ఫేక్‌లే! – ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్
అమరావతి: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలు, వెన్న వంటి ప్రాథమిక పదార్థాలు లేకుండానే నెయ్యి తయారు చేయగల ప్రత్యేక ప్రతిభ వైసీపీ నేతలకే ఉందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సంగం డెయిరీపై ఆరోపణలు చేసి 33 రోజుల పాటు తనను జైలులో పెట్టినా చివరకు ఏ తప్పూ నిరూపించలేకపోయారని తెలిపారు. వైసీపీ తమ తప్పును ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
శాసనమండలిలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సమర్థిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడటం దేవుడితో ఆటలాడటమేనని ధూళిపాళ్ల అన్నారు. సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీతో, అలాగే హెరిటేజ్ సంస్థకు ఇందాపూర్ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ సంస్థలు ఒకటే అయితే గత వైసీపీ ప్రభుత్వ కాలంలో నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనాలని టీటీడీ నుంచి ఎందుకు మెయిల్స్ పంపారో వైసీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు.
వైసీపీ నాయకుల రాజకీయాలు అన్నీ ఫేక్‌లేనని, వెబ్‌సైట్లు డౌన్ చేయడం, మార్ఫింగ్‌లు చేయడం వారి ప్రత్యేకతగా మారిందని ధూళిపాళ్ల మండిపడ్డారు. సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించినా ఒక్క తప్పూ కనుగొనలేకపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల కాలంలో కూడా తాను భయపడలేదని, ఇప్పుడూ భయపడనని స్పష్టం చేశారు.
పేర్ని నాని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ కాళ్లపై పడిన బందరు బియ్యం దొంగ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం” అని ధూళిపాళ్ల విమర్శించారు. సంగం డెయిరీ గుంటూరు రైతుల సంస్థ అని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళల సంస్థ అని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కూడా ధూళిపాళ్ల ఆరోపించారు. అప్పటి సీఎం జగన్ తనకు చెందిన మీడియా సంస్థలకు రూ.307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని, భారతీ సిమెంట్స్ ద్వారా కాంట్రాక్టర్ల నుంచి మూడు లక్షల టన్నుల సిమెంట్ మాయం చేశారని విమర్శించారు. తనపై నమోదు చేసిన 22 తప్పుడు కేసులను ప్రభుత్వం పునఃపరిశీలించి, తప్పులేదని తేలితే వాటిని రద్దు చేయాలని కోరారు.
తిరుమల లడ్డు కల్తీ ఘటనపై మాట్లాడుతూ, లడ్డూలో జంతువుల కొవ్వు మరియు వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు NDDB నివేదికలు వెల్లడించాయని చెప్పారు. కల్తీ నెయ్యి ద్వారా వచ్చిన అక్రమ డబ్బు విజయవాడకు రూ.12.5 కోట్లు, చెన్నైకు రూ.7.5 కోట్లు వెళ్లినట్లు SIT నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. మార్కెట్‌లో వెన్న ధర రూ.360 ఉంటే, కేవలం రూ.316కే నెయ్యి ఎలా సరఫరా చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
సంగం డెయిరీ 2020–21 నుంచే టీటీడీ నెయ్యి టెండర్ల కోసం ప్రయత్నిస్తోందని, అన్ని నిబంధనలు, శాస్త్రీయ పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే తమకు అవకాశం వచ్చిందని వివరించారు. హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని, దీనిపై ఎవరికైనా బహిరంగ సవాల్ విసురుతున్నానని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.
