January 16, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

నాడు కలిసిమెలిసి, నేడు కలబడి.. ఓటేసి కా(సా)రును ఇంటికి పంపిన ఖతర్నాక్ ప్రజలు

  • తిరగబడ్డ తెలంగాణ
  • రైతులకు జరిగిన అన్యాయం వెలకట్టలేనిది..
  • వ్యవస్థలు సర్వనాశనం
  • అరి గోసపడ్డ అన్నదాత
  • దరిద్రపు ధరణితో భూములు ఆగమాగం

నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక..

  • ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
  • సర్కార్ ను సాగనంపిన సకలజనులు

 

హైదరాబాద్, టీఎస్ డ్రీమ్స్, డిసెంబర్ 03: తెలంగాణ తన అస్థిత్వాన్ని కోల్పోలేదు, అణిచివేతపై తిరగబడే తన సహజ మనస్తత్వాన్ని కోల్పోలేదు. ఇదీ నిజమైన తెలంగాణ. తన ప్రత్యేకతకు ఒక కారణమైన కేసీఆర్ ను ఆదరించింది. చివరికి తనే ప్రత్యేకతను నాశనం చేయ చూస్తుంటే వేచి చూసి మరి ఈడ్చి దెబ్బకొట్టింది. ఫార్మ్ హౌజ్ లో పండబెట్టింది.

కారణాలు చెప్పుకోవాలంటే..

కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు స్థానికత పేర సాధించుకున్న రాష్ట్రంలో 317 జీఓతో స్థానికతను కోల్పోయేలా చేశాడు.15వ తారీఖు దాకా జీతాలు లేవు , DA లు లేవు , ప్రమోషన్స్ లేవు. ఏమన్నా అంటే కుక్క , దాని తోక కథ చెప్పే. వాళ్ళు అవకాశం కోసం చూశారు. పోస్టల్ బ్యాలెట్ లలో బీజేపీ , కాంగ్రెస్ లకు పడిన ఓట్లే నిదర్శనం.

ఇక నిరుద్యోగులకు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఒక గ్రూప్ ఎగ్జామ్ ను 3 సార్లు నిర్వహించాడంటే చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి. పెద్ద DSC అని చెప్పి 25 వేయిల ఖాళీలుంటే 5000 నింపుతానని నోరు మూయించాడు. పరీక్షల నిర్వహణలో అవినీతి , అక్రమాలు చెప్తే ఒక పుస్తకమే అవుతుంది. ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ తెలుస్తోంది.

రైతులకు జరిగిన అన్యాయం వెలకట్టలేనిది. ఒక్క రైతు బంధు ఇచ్చి రైతు రుణమాఫీ చెప్పి ఐదేండ్లు మభ్యపెట్టాడు. విత్తన సబ్సిడీ ఎగ్గొట్టాడు. డ్రిప్ సబ్సిడీ మరిచాడు. వడ్లు కొని క్వింటాల్ కు 2 నుంచి 10 కిలోల వరకు తెగ్గోస్తున్నా మౌనం వహించాడు.

ప్రజాస్వామ్యవాదుల ఆందోళనలు అణిచివేశాడు. వ్యవస్థలను నాశనం చేశాడు. ప్రజలను దూరం చేసుకున్నాడు. వాళ్ళ మొర వినలేదు. చివరకు మంత్రులకు కూడా అప్పోయింట్మెంట్ ఇవ్వలేదు. దళిత బంధు , బీసీ బంధు అని చెప్పి వాళ్లలో వాళ్ళు పైసలకు కొట్లాడుకొనేలా చేశాడు. అభివృద్ధి అంటే పెన్షన్ లు ఇవ్వడమేనని కొత్త అర్థం చెప్పాడు.

కాంగ్రెస్ కే ఎందుకు ఓటేశారంటే …

ప్రజలు కేసీఆర్ ను గద్దె దించాలనుకున్నారు. వారు మొదట బీజేపీ వైపు చూశారు. ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో కేసీఆర్ పట్ల బీజేపీ మెతక వైఖరి వారికి నచ్చలేదు. బీజేపీ , బీఆర్ఎస్ లు మిలాఖత్ అయ్యాయని ప్రజలు అనుకున్నారు. దానికి తోడు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి దించడం వారి అనుమానాలకు బలం చేకూరింది. అందుకే బీజేపీ ని దూరం పెట్టారు. వారికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపించింది. అందుకే ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా తెలంగాణ మొత్తం ఏకమైంది. తన సహజ సిద్ధమైన తిరుగుబాటు గుణాన్ని కేసీఆర్ కు రుచి చూపింది.

ఔను తెలంగాణ గుణమే అంత. అప్పుడు కరువు కాలంలో పన్ను కట్టుమన్న కాకతీయులను ఎదిరించిన సమ్మక్క సారక్కలు పుట్టిన నేల ఇది. మతం పేరిట మారణహోమం సృష్టించిన నిజాం , రాజాకార్లను ఉరికించి కొట్టిన భూమి ఇది. తన మతమే అయినా నిజాం కొమ్ము కాచిన భూస్వాములను , దేశ్ ముఖ్ లను తరిమివేసిన విప్లవ వీరులను కన్నతల్లి ఇది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తన ప్రత్యేక కాంక్షను వెదజల్లుతూనే సబ్బండ వర్ణాల సహాయంతో అడ్డుగా నిలిచిన సమైక్యాంధ్ర నాయకులను ఓడించి ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నది. ఇప్పుడు తన ప్రత్యేక హోదాకు కారకుడైన తన బిడ్డే తన అస్తిత్వానికి ప్రమాదమైతే అతడికే రాజకీయ సమాధిని తయారు చేసింది. రేవంత్ రెడ్డిని గద్దెపై కూర్చోబెట్టింది. ఔను తెలంగాణ తప్పు చేయదు. తన అస్థిత్వాన్ని నాశనం చేయ చూసే ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తుంది. అది కేసీఆర్ కావచ్చు , రేవంత్ రెడ్డి కావచ్చు.

జయహో తెలంగాణ..

౼౼ జై తెలంగాణ.

Copyright © All rights reserved. | Newsphere by AF themes.