ఇక కురుక్షేత్రమే: ఈటల
కౌరవులకు.. పాండవులకు మధ్య యుద్ధం
లెఫ్ట్, రైట్ కాదు..
కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యం
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని అపహాస్యం చేసేలా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారు రాజీనామా చేయకుండానే.. నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. హుజురాబాద్‌లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని.. కౌరవులకు.. పాండవులకు మధ్య యుద్ధం జరుగుతోందని ఈటల పేర్కొన్నారు. అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారని స్పష్టం చేశారు. లెఫ్ట్, రైట్ కాదు.. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తానన్నారు.
తనకు జైళ్లు, కేసులు కొత్త కాదని… తన డీఎన్ఏలోనే లౌకికవాదం ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టాలని చాలామంది శ్రేయోభిలాషులు తనను కోరారని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. వందల కోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర ఉన్నాయని.. ఓడగొడతారని.. రాజీనామా చేయవద్దని చాలా మంది తనకు తెలిపారని ఈటల వెల్లడించారు. యావత్ తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేస్తున్నానన్నారు. వడ్లు తడిచి మొలకలు వచ్చిన పట్టించుకోరని విమర్శించారు. యువత ఉపాధి లేకపోయినా పట్టించుకోరు. కానీ ఈటలను ఎలా చక్రబందంలో పెట్టాలని మాత్రం పోలీసు అధికారులను వాడుతున్నారన్నారు. నిర్బంధాలు కొత్త కాదని.. వాటిని తొక్కి పడేస్తారన్నారు. నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అని ఈటల పేర్కొన్నారు.
మేధావులు అంతా తనకు మద్దతు తెలపాలన్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అర్ధం చేసుకోవాలన్నారు. ప్రజాస్వామిక విధానం లేదని.. అందరూ హుజూరాబాద్ వచ్చి ప్రజలకు అండగా ఉండాలని ఈటల పిలుపునిచ్చారు. అమెరికా వారు కూడా తనను గెలిపించాలని కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు గౌరవం లేదని.. మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళలు అర్పిస్తూ వారి ఆశయాలకోసం పోరాటం చేయడానికి ముందుకు పోతున్నానని ఈటల పేర్కొన్నారు.
