December 1, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

రవీంద్రజిత్ ఆధ్వ‌ర్యంలో ‘జై ద్వారకా’ క్యాంపెయిన్ రికార్డు

1 min read

హైద‌రాబాద్: సముద్ర గర్భంలో ఉన్న పురాతన గుజ‌రాత్‌లోని ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన పరిశోధనలో అనేక‌ సంచలనాత్మక విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన IT’S 6TH WOW అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ద్వారక నగరంపై కొన్నేళ్లుగా చేస్తున్న ప‌రిశోధ‌న‌లు, కార్య‌క్ర‌మాలు గుజ‌రాత్ ప్ర‌భుత్వంతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ‌ ప్ర‌శంస‌లు కూడా పొందింది. ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం (World Sunken City Day) సందర్భంగా (డిసెంబర్ 21న‌) ద్వారకలో జై ద్వారకా క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వ‌హించిన శ్రీకృష్ణ జల జప దీక్ష ఇండియ‌న్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.

ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ మాట్లాడుతూ.. ”డిసెంబర్ 21న‌ ద్వారకలో ‘జై ద్వారకా’ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రపంచ నీటి లోతట్టు నగరాల దినోత్సవం సంద‌ర్భంగా శ్రీకృష్ణ జల జప దీక్ష నిర్వ‌హించాము. గుజ‌రాత్ పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖల‌ భాగస్వామ్యంతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైంది. తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్ర‌పంచ రికార్డుల్లో భాగమవ్వడం గర్వంగా ఉంది. ప్రాచీన ద్వారక నగరంను పునరావిష్కరించేందుకు, సముద్ర తలాలలో మళ్లీ తవ్వకాలను ప్రారంభించమని భారత ప్రభుత్వానికి వినతి చేయ‌డం ఈ శ్రీకృష్ణ జల జప దీక్ష ముఖ్య ఉద్దేశం. మా ‘ఇట్స్ సిక్స్‌త్ వావ్’ సంస్థ నుంచి నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించిన గుజ‌రాత్ ప్ర‌భుత్వా, కేంద్ర ప్ర‌భుత్వ టూరిజంకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాం.” అని చెప్పారు.

రికార్డు సృష్టించిన ఈ కార్యక్రమంలో జరిగిన ముఖ్య ఘట్టాలు
గ‌తంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ద్వారక తీరంలో స్కూబా డైవింగ్ నిర్వహించిన స్థ‌లంలోనే.. రవీంద్రజిత్‌తో పాటు ఏడుగురు స్కూబా డైవర్లతో సముద్రంలో జల జప దీక్ష నిర్వహించారు. అదే స‌మ‌యంలో స‌ముద్రంపైన సగభాగం నీటిలో శ్రీకృష్ణ జల జప దీక్షలో 70 మంది పాల్గొన్నారు. సముద్ర గ‌ర్భంలోని పురాత‌న న‌గ‌రం కోసం పూర్తిస్థాయిలో తవ్వకాలు విజయవంతమవ్వాలని ఆశిస్తూ హవన పూజ నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారక న‌గ‌రంపై మ‌రోసారి అంద‌రి దృష్టిని నిలిపింది. సముద్రంలో అత్యధిక మంది డైవర్లు ఆధ్యాత్మిక సాధన చేసిన సంఘటనగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ కార్యక్రమం కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకృష్ణ ద్వారక కథ ఆధారంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

గిన్నిస్ రికార్డు
ద్వారక నగరం ఒక‌ప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప‌రిశోధించి ప‌లు ఆధారాలు సేక‌రించారు ‘”ఇట్స్ సిక్స్‌త్ వావ్” సంస్థ స‌భ్యులు. ఈ నేప‌థ్యంలో “జై ద్వారకా క్యాంపైన్‌”లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలోకి ద్వారకను చేర్చేందుకు ఈ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో “ప్రపంచ పర్యాటక రేస్‌లైన్స్ డే” సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 17న‌ ద్వారకా స‌ముద్రం నీటిపై “జై ద్వారకా” లోగో రూపాన్ని700 మందితో రూపొందించ‌బోతున్నారు. ఈ ప్ర‌య‌త్నం గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును అందుకోబోతోంది. ఈ లోగో శ్రీ కృష్ణుని 7 నెమలి రెక్కలుగా, ప్రపంచంలోని 7 ప్రాచీన నాగరికతలను సూచిస్తుంది.

ఈ కార్యక్రమంలో “జై ద్వారకా క్యాంపైన్‌” నిర్వ‌హ‌కులు, “ఇట్స్ సిక్స్‌త్ వావ్” జనరల్ సెక్రటరీ రవీంద్రజిత్, భారత భారతి జాతీయ అధ్యక్షుడు వినయ్ పాత్రలే, జై ద్వారకా ప్రచార ఆర్గనైజర్ షాహీ ఖాన్, జై ద్వారకా ప్రచార కోఆర్డినేటర్ డాక్టర్ మీనాక్షి పద్మనాభన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. క్యాంపైన్ కో ఆర్డినేటర్ కె. కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

2 min read
2 min read
2 min read
Copyright © All rights reserved. | Newsphere by AF themes.