జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్‌పై విచారణ జరిపించాలి – మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించిన జర్నలిస్టులు
1 min read▪️ మానవహక్కుల కమిషన్‌కు జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి
▪️ కిడ్నాప్ తరహా అరెస్టు సీసీ ఫుటేజ్ సీడీ అందజేత
▪️ ప్రైవేట్ గుండాల్లా రఘును ఎత్తుకెళ్లారు
▪️ అమానుషంగా పోలీసులు వ్యవహరించిన తీరు
▪️ న్యాయ విచారణ జరిపించి, రఘు కుటుంబానికి న్యాయం చేయాలి
▪️ మానవ హక్కుల కమీషన్‌కు TJF, TWJF సంఘాల లేఖ అందజేత
హైదరాబాద్ (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ జర్నలిస్టుల ఫోరం(TJF), టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జర్నలిస్టులు మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు TJF అధ్యక్షుడు పల్లె రవి కుమార్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, TWJF అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య తదితరులు మానవహక్కుల కమిషన్ సెక్రటరీ విద్యాధర్ భట్ చక్రహరికి లేఖ అందజేశారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్ళిన సీసీ కెమరా దృశ్యాలు కూడా అందించారు.
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్ గిరి ప్రాంతానికి చెందిన తొలి వెలుగు జర్నలిస్ట్ గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, రఘు కుటుంబానికి న్యాయం చేయాలని ఈ విషయంలో జోక్యం కోరుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టులం తీవ్ర ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు.
“ప్రజల పక్షాన నిలిచి అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పాపానికి జర్నలిస్ట్ రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ రఘు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుషంగా ఉంది. జూన్ 3వ తేదీన మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లారు. రఘును ఎవరు తీసుకు వెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో తోటి జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేది. రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా లేక ప్రైవేట్ గుండాలా అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి బజారులో అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన ఫూటేజీలు కూడా ఉన్నాయి. గుర్రంపోడు భూముల విషయంలో రఘు పై మోపిన కేసులు పూర్తిగా అక్రమమైనవి. జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకెళ్లడం పూర్తిగా అమానుషం. చట్టం పరిధిలో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని పాటించకుండా అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారు. రఘు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని అక్రమంగా అరెస్ట్ అయిన జర్నలిస్ట్ రఘుకు న్యాయం చేయాలని కోరుతున్నాము.” అంటూ లేఖ రాసి మానవహక్కుల కమిషన్‌కు అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, టీ-జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లె రవి కుమార్, ఉపాధ్యక్షుడు సతీష్ కమల్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, జనరల్ సెక్రటరీ బసవ పున్నయ్య, పిల్లి రాంచందర్, టీ-జర్నలిస్టుల ఫోరం నాయకులు కోడికంటి శ్రీనివాస్, స్వామి ముద్దం, పోగుల ప్రకాశ్, పాలకూరి రాజు తదితరులు పాల్గొన్నారు.