January 20, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

ఏడేళ్లలోనే అద్భుతమైన తెలంగాణ – సీఎం కేసీఆర్ సంతోషం

అనతికాలంలోనే బలమైన పునాదులు వేసినం
ఉద్యమ నినాదాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం
తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నాం
దేశానికే.. అన్నపూర్ణ తెలంగాణ: సీఎం కేసీఆర్

హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను, స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు. భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
సమైక్యరాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను, వొక్కొక్కటిగా ఓపికతో, దార్శనికతతో అవాంతరాలను లెక్కజేయకుండా సక్కదిద్దుకుంటూ వస్తున్నామని సిఎం అన్నారు. తెలంగాణ సమాజం.. తొంభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండివున్న నేపథ్యంలో.. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నిటికీ మించి.. అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్పూర్తి వున్నదన్నారు.
వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు, ఆసరా అందాల్సిన ప్రతివొక్క వర్గానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలబడిందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ తెలంగాణను సాధించుకున్న ఫలితాలను వారికి అందిస్తూ, వారి ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా మారిందన్నారు.
తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల అనతికాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడం వెనక తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత ధీక్ష ఇమిడివున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించి, తెలంగాణ గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. ఈ ఘన విజయంలో తెలంగాణ ప్రజల సహకారం మహా గొప్పదని, అందుకు వారికి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా ఉపద్రవం వలన రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామని సిఎం అన్నారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో తెలంగాణను బంగారి తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

3 thoughts on “ఏడేళ్లలోనే అద్భుతమైన తెలంగాణ – సీఎం కేసీఆర్ సంతోషం

  1. ఆరు ద‌శాబ్దాల సుదీర్ఘ స్వప్నం.. చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ఏడు వ‌సంతాలైంది..! అమరుల బలిదానాల్లో ఆరిపోయిన ప్రాణాలు, కష్టాల నడుమ గాయాల నడుమ వొడితిరుగుతున్న కడుపుకోతలు, లక్షల గొంతులు చించుకోని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిల్లు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినయి. విజయం తర్వాత పొందే సంబూరాన్ని తెలంగాణ పంచుకుంటున్నది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమొక్కటే. మన కాలపు చరిత్ర, మన కండ్ల ముందటి విజయం. తెలంగాణ ప్ర‌జ‌ల కండ్ల‌ల్ల వెలుగునిండింది.

    సంబూరం త‌ర్వాత ఇప్పుడు వికాసం వైపు అడుగులు పడవలసి ఉన్నది. స్థానిక వనరులు, సహజ సంపదలు ఇక్కడి ప్రజల బ్రతుకుల్లో పచ్చదనం నిలిపేందుకే వినియోగించాలి. విజయం తర్వాత సవాళ్ళు సహజమే. వివిధ అస్తిత్వాలు, వివిధ సమూహాలు తమ సందేహాలు వెలిబుచ్చడం తప్పనిసరి. వైరుధ్యాలుంటాయి. సంఘర్షణలుంటాయి. వాటన్నింటిని సవ్యంగా పరిష్కరించగలగాలె. ఆయా సమూహాల పరస్పర అవగాహన సాధించగలగాలె. అందరి ఆలోచనలు తెలంగాణను బంగారు తునకగా మార్చుకునే దిశగా కార్యరూపం దాల్చవలసి ఉన్నది.

    తెలంగాణ ఉద్యమం అస్తిత్వ చైతన్యఫలం. వికాసం కూడా అస్తిత్వ పునాదుల మీదనే జరగాలె. అభివృద్ధి ప్రజాజీవితంతో అనుసంధానమవుతూ కొనసాగాలె. సాగుతున్న తెలంగాణ నిర్మాణానికి రాజకీయ అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం రెండూ కీలకమైన పార్వ్శాలు. అవి బలంగా నిర్మాణమయినప్పుడే తెలంగాణ అస్తిత్వం పరిఢవిల్లుతది. ఆ ఎరుకతోనే మ‌నం క‌ల‌లుగ‌న్న స‌రికొత్త తెలంగాణ అవతరిస్తది.
    జై తెలంగాణ‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.