November 4, 2024

Tsdreams

INDIAN NEWS NETWORK

REVIEW ”ది ఇండియన్ స్టోరి” మూవీ రివ్యూ

సెన్సేష‌న‌ల్ స‌బ్జెక్టుతో తెలుగులో తెర‌కెక్కిన‌ మూవీ “ది ఇండియన్ స్టోరి”. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ జంట‌గా నటించిన ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. మెసెజ్‌తో పాటు కమర్షియల్ హంగుల‌తో తెర‌కెక్కిన “ది ఇండియన్ స్టోరి” నేడు (మే 3న‌) థియేట‌ర్‌ల‌లో విడుద‌లైంది. డైరెక్ట‌ర్ ఆర్ రాజశేఖర్ రెడ్డి తెర‌కెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
ఒక‌ హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ఒక ముస్లి వ‌ర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒక వర్గం మీద మరో వర్గం త‌ర‌చూ మ‌త‌ప‌ర‌మైన విద్వేషాలు ర‌గిల్చుతూ ప్రతీకార దాడులు చేసుకుంటారు. ఈ క్రమంలో వైజాగ్ నుంచి వస్తాడు రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి). రెహమాన్ దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి అతని స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అప్పటికే అప్పుల్లో ఉన్న ఫేకు రెహమాన్ దగ్గర గోల్డ్ బిస్కెట్స్ కొట్టేసి అప్పుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తుంటాడు. గోల్డ్ బిస్కెట్స్ అమ్మే క్రమంలో ఫేకు స్నేహితుడు ముస్తాఫాపై శ్రీరామ్ వర్గం దాడి చేస్తుంది. ఆస్పత్రిలో ఉన్న ముస్తాఫాను చూసేందుకు వెళ్లిన ముస్లిం నాయకుడు కబీర్ ఖాన్ పై హత్యాయత్నం జరుగుతుంది. కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్ ను కాపాడతాడు రెహమాన్. ఆ ఘటనలో రెహమాన్ గాయపడతాడు. అప్పటి నుంచి కబీర్ ఖాన్ కు ఆప్తుడవుతాడు రెహమాన్. ఫేకు ఒత్తిడిలో కబీర్ ఖాన్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు రెహమాన్. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్, కబీర్ ఖాన్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్) ప్రేమలో పడతారు. ఇంతలో ముస్తఫా చనిపోతాడు. అతని మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెహమాన్ తో మాట్లాడాలని ఒంటరిగా తీసుకెళ్లిన కబీర్ ఖాన్ అతనిపై దాడికి దిగుతాడు. తనను కాపాడిన రెహమాన్ పై కబీర్ ఖాన్ ఎందుకు దాడికి దిగాడు. జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా మారి కబీర్ ఖాన్ వర్గానికి ఎందుకు దగ్గరయ్యాడు. రామరాజు, కబీర్ ఖాన్ గతం ఏంటి? మతం పేరుతో ఈ ఇద్దరు నాయకులు ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? ఆ కుట్రను రెహమాన్ అలియాస్ రాజ్ ఎలా ప్రజలకు తెలియజేశాడు? అనేదే మిగ‌తా క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌:
హీరోగా రాజ్‌భీమ్ రెడ్డి యాక్టింగ్ సూప‌ర్ అనే చెప్పాలి. క్యారెక్టర్‌కు త‌గిన‌ట్టు చ‌క్క‌గా కుదిరాడు. అన‌వ‌స‌ర‌పు హంగామాకు పోలేదు. రాజ్ భీమ్ రెడ్డి ఫైట్స్ సీన్స్‌లో బాగా చేశాడు. ఇక హీరోయిన్ జరా ఖాన్ భావోద్వేగంతో క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఫేకు పాత్ర‌లో చమ్మక్ చంద్రకు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉంటాడు. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
సాంకేతిక‌ప‌రంగా చూస్తే “ది ఇండియన్ స్టోరి” సినిమాను డైరెక్ట‌ర్ చాలా క్వాలిటీగా తెర‌కెక్కించిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ క‌నిపిస్తాయి. నిమ్మల జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, సందీప్ కనుగుల మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. సందీప్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా సీన్స్ ను మరింత ఎలివేట్ చేసింది. స్టంట్స్, ఎడిటింగ్ వంటి క్రాఫ్ట్స్ పనితనం కనిపించింది. యాక్షన్ సీక్వెన్సులను బాగా తెరకెక్కించారు డైరెక్ట‌ర్.

విశ్లేషణ:
త‌మ స్వార్థ రాజ‌కీయాల కోసం మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్టే మ‌త నాయ‌కులు బండారం బ‌య‌ట‌పెట్టిన చిత్ర‌మిది. మ‌త రాజ‌కీయాలు ఇలా కొన‌సాగుతాయ‌ని నిర్మాత, హీరో రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి సాహసోపేతంగా ఈ సినిమాను రూపొందించారు. మతం పేరుతో సమాజాన్ని విడదీసి తమ పబ్బం గడుపుకునే స్వార్థ రాజకీయ నాయకుల కుట్రలను తిప్పికొట్టే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేస్తుందీ “ది ఇండియన్ స్టోరి”. హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. సెపరేట్ గా కామెడీ ట్రాక్స్ కాకుండా ఈ కథతో పాటే కామెడీ ట్రావెల్ అవుతుంది. ఆస్పత్రిలో రెహమాన్, చమ్మక్ చంద్ర, నర్స్ క్యారెక్టర్స్ మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు. ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఆయన చర్చి ఫాదర్ క్యారెక్టర్ లోనూ నటించాడు. హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే చిన్న లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఫ‌స్ట్‌హాఫ్‌లో మొద‌ల‌య్యే ట్విస్టుల‌కు ఒక్కొక్కటిగా సెకండాఫ్‌లో రివీల్ అవుతూ వస్తాయి. శ్రీరామ్, కబీర్ ఖాన్ గతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

మతం కంటే మాన‌వ‌త్వం గొప్ప‌ద‌ని మంచి సందేశాన్ని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి తెర‌కెక్కించిన “ది ఇండియన్ స్టోరి” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకుంటుంద‌ని నిస్సందేహంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3.25 / 5

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.