March 28, 2025

Tsdreams

INDIAN NEWS NETWORK

తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత

హైదరాబాద్ (టీఎస్ డ్రీమ్స్ ప్ర‌తినిధి): తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రేపటి నుంచి సినిమా హాళ్లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్‌, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా మెట్రో, బస్సు సర్వీస్‌లు నడవనున్నాయి. తెలంగాణలో జులై 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. మే 12 నుంచి జూన్‌ 19 వరకు 38 రోజులపాటు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగింది.

దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా కరోనా నియంత్రణలోకి అధికారుందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్థారించింది. ఈ మేరకు…జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్‌ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

కాగా … అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో, జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో, రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని, అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.