ఔరా!.. ఇది కల నా? లేక నిజమా ?
- ఎన్నాళ్లకెన్నాళ్లకు.. గ్రీన్ సిగ్నల్..
- 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్,(టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఓ శుభవార్త వినే అవకాశం దక్కింది. ఎన్నాళ్లకెన్నాళ్లకో.. ఈ వార్త విన్న తెలంగాణలోని యువత, నిరుద్యోగులకు ఔరా ఇది కల నా? లేక నిజమా? అనేలా ఉంది సర్కార్ ప్రకటన. తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను రెండోదశలో భర్తీ చేయాలన్నారు. శుక్రవారం రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. నూతన జోన్ల ఏర్పాటుకు ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయ’’ని అన్నారు.
