జగన్ బెయిల్ రద్దు అవుతుందా?
ఆస్తుల కేసులో ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పుడు మళ్లీ ఆయన బెయిల్ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు అవుతుందని.. బీజేపీ పెద్దలు వెనుకుండి అంతా చేస్తున్నారనే చర్చ విపరీతంగా జరుగుతోంది. ఇటీవల తిరుపతి ఉప ఎన్నిక తరువాత ఆ చర్చ రచ్చ రచ్చ అవుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడంతో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. రఘురామ వెనుకాల బీజేపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా రఘురామ పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. మొదట ఈనెల 22న విచారణ జరిపింది. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది. తరువాత విచారణ నేటికి వాయిదా పడింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఇరు వర్గాల వాదనలు వింది. అయితే కౌంటర్ దాఖలుకు జగన్ తరపు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సమయం కోరారు. దీంతో ఈ కేసును 17వ తేదికి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
జగన్ కేసుల్లో విచారణ ఆలస్యంగా జరుగుతోందని బెయిల్ రద్దు చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు. 11 ఛార్జ్ షీట్లలో జగన్ ఏ1గా ఉన్నా.. విచారణకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారన్నారని. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్టులో పిటిషన్ వేసినట్లు రఘు రామ అన్నారు. జగన్ నిర్దోషిలా బయటపడాలనే నా ఉద్దేశమని అందుకే కోర్టును ఆశ్రయించాను అంటున్నారు. పార్టీని రక్షించుకునే బాధ్యత వైసీపీ ఎంపీగా తనపై ఉందన్నారు.
ఏపీలో ప్రభుత్వ పథకాలు, పాలన పేరుతో విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థ నిద్రపోతోందా అని రఘురామ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారన్నారు. కోర్టు విచారణ తప్పించుకుంటుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అంతేకాదు తన పదవిని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందన్నారు. అంతేకాదు సీబీఐ కేసుల్లో నిందితులైన నలుగురికి రాజ్యసభకు పంపారని.. అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని విమర్శించారు. ఓ అధికారికి ఏకంగా ముఖ్యకార్యదర్శి హోదా కల్పించారన్నారు. మరికొంతమంది నిందితుల బంధువులకు డిప్యూటీ సీఎంలు, ఇతర పదవులు కట్టబెట్టారన్నారు. వీరంతా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని అనుమానం వ్యక్తం చేశారాయన. కచ్చితంగా న్యాయమే నెగ్గుతుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.
