January 17, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

నోటిఫికేషన్ లేక..ఉద్యోగం రాక …విద్యార్థి నేత బలవన్మరణం

గజ్వేల్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రమే తన ఊపిరనుకున్నాడు, రాష్ట్ర సాధనతోనే తన భవిష్యత్తులో మార్పు వస్తుందని భావించాడు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఉవ్వేత్తున ఎగిసిపడుతున్న ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహించాడు. ఈ ప్రాంత వాసులకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమంపై పిడికిలి బిగించి బరిలో దిగిన ఘనత అతనిది. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థిగా అతని పాత్ర కీలకం. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ కు చెందిన విద్యార్థి కొప్పు రాజు (2009 నిజాం కాలేజ్ జేఏసీ లీడర్) ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది.

రాష్ట్రమొస్తే తనలాంటి ఎందరో విద్యార్థులకు ఉద్యోగం వస్తుందని భావించాడు. తనతోపాటు మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతుందనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఏడేళ్లు అయినా కూడా ఎక్కడా వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితులు ఉండడంతో కలత చెందాడు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాదేమోనని తనలాంటి వాళ్లకెందరికో ఇక ఉద్యోగాలు దక్కవేమోనని బెంగతో, తీవ్ర నిరాశకు లోనై జీవితంపై విరక్తి చెంది తానకు తానుగా తనువు చాలించుకున్నాడు. ఆశలు అడియాశలై ఇక తనకు భవిష్యత్తు అంధకారమేననుకొని భావించిన తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, విద్యార్థి నాయకుడు కొప్పు రాజు తన నూరేళ్ల జీవితానికి ముగింపు పలికాడు. దీంతో రాజు
జీవితం అర్ధాంతరంగా ముగియడంతో తల్లిదండ్రులతోపాటు తెలంగాణ ఉద్యమకారులు కన్నీరు మున్నిరవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు ఇచ్చిన హామీలన్ని నేరవేర్చాలని ఉద్యమకారులు కోరుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, ఇకపై రాజులాగా అర్ధాంతరంగా ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి తొలి,
మలి దశ ఉద్యమకారుల ఫోరం కోరుతుంది.

కొప్పురాజు రాసిన లేఖలోని సారాంశం యథాతధంగా …
సీఎం సార్… నాలాంటి నిరుద్యోగులకు న్యాయం చేయండి సర్.. అసువులు బాసిన తెలంగాణ అమర విరులకు జోహార్లు, జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ సూసైడ్ నోట్ రాశాడు. 2009 – నుండి 2011 వరకు తెలంగాణ విద్యార్థుల ఉద్యమమే ఓ యుద్దo, కష్ట జీవుల నెత్తుటి చెమట సుక్కల ప్రతిరుపాలె విద్యార్థి బిడ్డలు, ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ విద్యార్థి ఉద్యమమే ఒక మహోన్నత చరిత్ర. విరిగిన లాఠీ, కమిలిన గాయాలు, అగ్నికి అహుతైన తనువులు ద్వoసమైన బతుక్కు.. సాక్షి, తెలంగాణ విద్యార్థి,,, ఇకపై నా చావుతోనై.నా తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరగాలని, నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా…

ఇట్లు..
తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు
మీ… కొప్పు రాజు. తక్కువ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.