రాజకీయాల్లోకి రాను…
- సామాన్యుడిగానే హ్యాపీగున్నా: నటుడు సోనుసూద్
- 2022లో ముంబై మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ గాలం ?
- పొలిటికల్ ఎంట్రీపై వార్తలను ఖండించిన సోనుసూద్
- ట్విట్టర్ ద్వారా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): సినీ ఇండస్ట్రీలో విలన్ గా కఠినాత్ముడిగా ఉండే సోనుసూద్ ప్రజల గుండెల్లో ఓ దేవుడిగా నిలిచాడు. ప్రస్తుతం సోనూకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ‘సోనూసూద్’ రీల్ లైఫ్ విలన్ కాస్తా… కరోనా సమయంలో ‘రియల్ లైఫ్ హీరో’గా మారిపోయాడు. అడిగిన వారికి లేదనకుండా తనవంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నాడు సోనూసూద్. పేరుకు తగ్గట్టే మనిషి కూడా బంగారం అని నిరూపించుకున్నాడు. ఏడాదిన్నరకు పైగా కరోనా మహమ్మారి అనేక మంది బలిగొనగా ఎంతోమంది అనాధలుగా మిగిలారు. మరెంతోమందిని ఉద్యోగం, ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు. కరోనా తొలిదశలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టగా అనేక మందికి సోనూ సాయం చేశాడు. విదేశాల్లో ఉన్నోళ్లకు విమానాలు పంపి రప్పించాడు. స్వంత ఊర్లను వదిలి ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండేవారెందర్నో ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా చేయందించి సొంతింటికి వచ్చేలా చేశాడు. మరెంతోమందికి అన్నం పెట్టి ఆసరాగా నిలిచాడు. అంతేకాదు కరోనా భారీన పడ్డ ఎందరికో ఆక్సీజన్ సిలీండర్లను అందించడమే కాకుండా అంబులెన్స్, ఆస్పత్రి ఖర్చులు సైతం అందజేసి తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ భాయ్. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేయలేని ఎన్నో మంచి పనులు చేసి చూపించాడు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, అగ్ర నటులు, ఆర్థికంగా వెల్ అండ్ ఎంతో మంది ఉన్నా సమాజానికి రూపాయి ఖర్చు చేయడానికి ఆలోచిండ్రు. ఈ సమయంలో తన కుటుంబ ఖర్చులను మరిచి ప్రజాసేవ చేసిన సోనుసూద్ కు కొన్నిచోట్ల గుడి కట్టారు. పలుచోట్ల విగ్రహాలు, కటౌట్లు పెట్టి క్షీరాభిషేకాలు చేశారు. మరికొంతమంది అయితే ఇళ్లల్లో ఈ విలన్ ఫోటో పెట్టి పూజిస్తుండ్రు కూడా. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు నెటిజన్లు, ఆయన అభిమానులు సోనూసూద్‌ని రాజకీయాల్లోకి రావాలని కోరుతుండగా మరికొందరు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో ఒకడుగు ముందుకేసి 2022 లో జరుగనున్న బృహత్ ముంబై ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా సోనూ సూద్ దిగబోతున్నారని, అదీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు టాక్ నడుస్తోంది. మేయర్ అభ్యర్థికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదని తెలిసింది. పైగా ఆ వ్యక్తికి… యువత నుంచి మంచి క్రేజ్, మద్దతు ఉండాలని తెలిసింది. ఈసారి బీఎంసీ ఎన్నికల్లో యంగ్ ప్రొఫెషనల్స్‌కీ, సోషల్ యాక్టివిస్టులకూ, స్టార్టప్ ఓనర్లకూ టికెట్లు ఇవ్వడం ద్వారా… ఇమేజ్ పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. గతంలో సోనూసూద్‌పై రాజకీయ నాయకులు కొందరు చవాకులు విసిరారు. రాజకీయాల కోసమే ఈ సహాయాలు అంటూ విమర్శించారు. అభిమానుల్లో ఒకింత అనుమానం, భయం నెలకొంది. తాజాగా ఆ వార్తలపై ట్విట్టర్ వేదికగా సోనూసూద్ క్లారిటీ ఇచ్చేశాడు. సోనూసూద్ 2022 ముంబయి మేయర్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి అన్న ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. అది నిజం కాదు, సామాన్యుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని పుకార్లకు కళ్లెం వేశాడు సోనూసూద్. అయితే ఆ వార్తలకు అత్యధిక మంది నెటిజన్స్ మాత్రం సోనూ భాయ్ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. మరికొంత మంది మాత్రం ఈ బురదలోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
