వారసత్వ సంపదను అమ్ముతున్న కేసీఆర్ : రేవంత్రెడ్డి
కోకాపేట భూముల్లో కేటీఆర్ భార్యకూ వాటాలు
హైదరాబాద్, (టీఎస్ డ్రీమ్స్ ప్రతినిధి): కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ సంపదను అందినకాడికి అమ్ముతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విమర్శించారు. వెయ్యికోట్ల కుంభకోణంపై వివరణ ఇస్తారని ఆశించామని, బంగారంకంటే విలువైన భూములను అమ్ముతూ రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ఆనాడు ప్రాజెక్టుల కోసం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కాంగ్రెస్ అమ్మాలని చూస్తే కేసీఆర్ అడ్డుపడ్డారని రేవంత్రెడ్డి అన్నారు. సీమాంధ్ర సీఎంలు భూములు అమ్మడానికి భయపడ్డారని, ఆనాడు అమ్మకుండా మిగిలిపోయిన భూములను కేసీఆర్ తన బంధువులు, బినామీలకు కట్టబెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట, నార్సింగిలో పేదలకు కేటాయించిన భూములను అమ్ముతున్నారని, ప్రెస్టేజ్ ఎస్టేట్, శ్రీచైతన్య కంపెనీ కూడా 15 ఎకరాలు కొనుగోలు చేశాయని రేవంత్ రెడ్డి అన్నారు.
కోకాపేట భూముల వెనక భూకుంభకోణాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. మంత్రి కేటీఆర్ కొత్త తరహా దోపిడీ విధానాన్ని కనిపెట్టారని ఆయన విమర్శించారు. కోకాపేట భూములు కొన్న కంపెనీలకు కేటీఆర్ కు సంబంధం ఉందని ఆయన అన్నారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న అత్యంత విలువైన 7621 గజాల స్థలాన్ని అగ్గువకే కట్టబెట్టారని ఆరోపించారు. ఇందులో కేటీఆర్ భార్య కల్వకుంట్ల శైలిమతో పాటు యలమంచిలి సీమ, యలమంచిలి సుష్మశ్రీకి వాటాలున్నాయని, ప్రభుత్వం వీటిని రెగ్యులరైజ్ చేసిందని ఆయన చెప్పారు. 1400కోట్ల ప్రాజెక్టు విలువైన భూమిని కేటీఆర్ సన్నిహితుడు తేలుకుంట్ల శ్రీధర్ చక్కబెట్టారని చెప్పారు.
