అపురూప చరిత్రకు ఏడేళ్లు..
దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జై తెలంగాణ’ ఆవాజ్ !
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఏడు వసంతాలైంది..! ఆరు దశాబ్దాల పోరాట కాలంలో ఎన్నో భావోద్వేగాలు.. దిక్కులు పిక్కటిల్లేలా నినదించిన ‘జై తెలంగాణ’ ఆవాజ్, అమరుల బలిదానాల్లో ఆరిపోయిన ప్రాణాలు, కష్టాల నడుమ, గాయాల నడుమ, వొడితిరుగుతున్న కడుపుకోతలు, లక్షల గొంతులు చించుకోని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిల్లు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినయి. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమొక్కటే. మన కాలపు చరిత్ర, మన కండ్ల ముందటి విజయం. తెలంగాణ ప్రజల కండ్లల్ల వెలుగు నిండింది. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం..
ఆరు దశాబ్దాల ఉద్యమం నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వికాసం వైపు వడివడిగా అడుగులు వేయవలసి ఉన్నది. స్థానిక వనరులు, సహజ సంపదలు ఇక్కడి ప్రజల బ్రతుకుల్లో పచ్చదనం నిలిపేందుకే వినియోగించాలి. విజయం తర్వాత సవాళ్ళు సహజమే. వివిధ అస్తిత్వాలు, వివిధ సమూహాలు తమ సందేహాలు వెలిబుచ్చడం తప్పనిసరి. వైరుధ్యాలుంటాయి. సంఘర్షణలూ ఉంటాయి. వాటన్నింటిని సవ్యంగా పరిష్కరించగలగాలె. ఆయా సమూహాల పరస్పర అవగాహన సాధించగలగాలె. అందరి ఆలోచనలు తెలంగాణను బంగారు తునకగా మార్చుకునే దిశగా కార్యరూపం దాల్చవలసి ఉన్నది.
తెలంగాణ ఉద్యమం అస్తిత్వ చైతన్యఫలం. వికాసం కూడా అస్తిత్వ పునాదుల మీదనే జరగాలె. అభివృద్ధి ప్రజాజీవితంతో అనుసంధానమవుతూ కొనసాగాలె. సాగుతున్న తెలంగాణ నిర్మాణానికి రాజకీయ అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం రెండూ కీలకమైన పార్వ్శాలు. అవి బలంగా నిర్మాణమయినప్పుడే తెలంగాణ అస్తిత్వం పరిఢవిల్లుతది. ఆ ఎరుకతోనే మనం కలలుగన్న సరికొత్త తెలంగాణ అవతరిస్తది. తెలంగాణ బిడ్డలకు ఆటుపోట్లు కొత్తేం కాదు. మహా విపత్తు సంభవించిన ఈ సమయంలో గుండెల నిండా అనాటి ఉద్యమ స్పూర్తిని రగిలించుకుని ఈ మహమ్మారిపై నిలిచి గెలవాలె.
రాష్ట్ర ప్రజలందరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..
జై తెలంగాణ..
- స్వామి ముద్దం
9949839699