ఒంటరి మహిళలకు RJ సంస్థ మానవత్వ సాయం
1 min readఒంటరి మహిళల కోసం పని చేస్తున్న ఏకైక సంస్థ.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్’పై ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్
ఒంటరి మహిళలకు చేయూతనిచ్చేందుకు ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ పని చేస్తోంది. ఈ క్రమంలో ఈ స్వచ్చంద సంస్థ ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్ జీవన్ లాల్, యువ హీరో నరేన్ వనపర్తి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో.. కమిషనర్ జీవన్ లాల్ మాట్లాడుతూ.. ‘ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ సంస్థ గురించి చాలా విన్నాను. ఒంటరి మహిళల గురించి పాటు పడే సంస్థలు చాలా అరుదు. నాకు తెలుసు ఒంటరి మహిళల గురించి పని చేస్తున్న ఏకైక సంస్థ ఇదే. ఒంటరి మహిళల కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇంట్లో మగాడు చేసే పనుల వల్లే మహిళలకు కష్టాలు వస్తాయి. ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక పథకాలేవీ తీసుకు రావడం లేదు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వాలు కూడా ఒంటరి మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు తీసుకు వచ్చేలా ప్రయత్నాలు చేయాలి. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి ఈ సంస్థ లేఖలు రాయాలి. ఒంటరి మహిళల కష్టాలను వివరించాడు. ఓ డేటా ప్రకారం ఇండియాలో ఏడున్నర కోట్ల ఒంటరి మహిళలున్నారు. అంటే వారి మీద ఆధార పడే వారి సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకుంటే దాదాపు 20 నుంచి 25 కోట్ల మంది ఉంటారు. వీరందరి కోసం ప్రభుత్వం కచ్చితంగా ఆలోచించాలి. అలా ఆలోచించేలా ఈ సంస్థ ముందుండి పని చేయాలి. వీరికి ఏ సహాయం కావాలన్న నేను ముందుంటాను. వీలైన సాయాన్ని అందిస్తాను’ అని అన్నారు.
ఉమా కార్తిక్ మాట్లాడుతూ.. ‘తండ్రి లేకుండా పిల్లల్ని పెంచడం సాధారణ విషయం కాదు. నాకు కూడా చిన్న పిల్లలున్నారు. ఒంటరి మహిళల కష్టాలు నాకు తెలుసు. నాకు వీలైనంత వరకు సాయం చేయాలని ఈ సంస్థను స్థాపించాను. త్వరలోనే ఓ స్కూల్‌ని కూడా స్థాపించాలని అనుకుంటున్నాను. దానికి అందరి సపోర్ట్ కావాల’ని కోరుకుంటున్నాను.
ఆర్జే ఇన్సిపిరేషన్ హ్యాండ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడ్పాటుగా జీవన్ లాల్ గారు ఈ సంస్థ కి 25 వేల రూపాయలను విరాళాన్ని అందజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన సుజాత 5 వేల రూపాయలను RJ ఇన్స్పిరేషన్ హాండ్స్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వారు పిల్లలకు స్కూల్ బాగ్స్ అందించగా.. wroom సంస్థ వారు లంచ్ బాక్స్ బాగ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో నరేన్ వనపర్తి, కిరణ్ జీవి వంటి వారు పాల్గొన్నారు.