September 20, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

గ్లోబల్ NRI టీడీపీకి కొత్త దిశ.. గురురాజా మాస్టర్ ప్లాన్ భేష్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే వేదికపైకి తీసుకురావడం.. వారి సమస్యలకు అండగా నిలవడం.. పెట్టుబడులు, సేవా కార్యక్రమాలకు మార్గం సుగమం చేయడం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలను భాగస్వాములుగా మార్చడం.. ఇదే లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా తెలిపారు.

మహా న్యూస్ సీఎండీ మర్రెల వంశీకృష్ణతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గురురాజా.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఏర్పాటుకు కారణాలు, తనకు అప్పగించిన బాధ్యతలు, ప్రవాసాంధ్రుల సమస్యలు, పెట్టుబడులు, పార్టీతో ఎన్ఆర్ఐల అనుసంధానం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లతో తన రాజకీయ ప్రయాణం తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.

ఒకే గొడుగు కిందకు ఎన్ఆర్ఐ టీడీపీ

గతంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాలు వేర్వేరుగా పనిచేసేవని గురురాజా తెలిపారు. ఒక దేశంలో ఒక కమిటీ, మరో దేశంలో మరో కమిటీ ఉండటంతో పాటు.. కొన్ని దేశాల్లో ప్రాంతాల వారీగా వేర్వేరు గ్రూపులు కూడా ఉండేవని చెప్పారు.

ఈ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారా లోకేష్ ఆలోచన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకలాపాలకు ఒకే విధమైన వ్యవస్థను తీసుకురావడం లక్ష్యమన్నారు.

దేశాలు, రాష్ట్రాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. కులాలు, మతాలు, వృత్తులకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లాలని పార్టీ నాయకత్వం సూచించిందన్నారు.

పార్టీ కొంతమంది వ్యక్తులకు మాత్రమే సంబంధించినది కాదని.. ప్రతి కార్యకర్తకు పార్టీపై హక్కుతో పాటు బాధ్యత ఉండేలా సంస్థాగత వ్యవస్థను నిర్మించాలన్నదే లక్ష్యమని వివరించారు.

ఎన్ఆర్ఐలకు కేవలం పార్టీ కాదు.. భరోసా వ్యవస్థ

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని కేవలం రాజకీయ కార్యకలాపాలకే పరిమితం చేయకుండా.. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సమయంలో అండగా నిలిచే వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తన ఆలోచన అని గురురాజా చెప్పారు.

కొత్తగా విదేశాలకు వెళ్లిన ప్రవాసాంధ్రుడికి భాష తెలియకపోవడం, ఉద్యోగం, వైద్యం, కుటుంబ సమస్యలు ఎదురుకావడం వంటి ఇబ్బందులు ఉండొచ్చన్నారు. అలాంటి సమయంలో ఒక పరిచయ వ్యవస్థ లేదా సహాయ కేంద్రం ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

ప్రమాదాలు జరిగినప్పుడు, మరణాలు సంభవించినప్పుడు మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం వంటి సందర్భాల్లో ఇప్పటికే ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు సహకరించిన విషయాన్ని ప్రస్తావించారు.

అంతేకాకుండా సమస్య విదేశాల్లోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తల్లిదండ్రుల భూమిని ఎవరైనా ఆక్రమించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఉండటం, ఇతర స్థానిక సమస్యలు తలెత్తడం వంటి సందర్భాల్లోనూ ఎన్ఆర్ఐలకు సహాయం అందించే వ్యవస్థ అవసరమని చెప్పారు.

ప్రవాసాంధ్రుడు విదేశంలో ఉన్నా.. అతని సమస్య స్వదేశంలో ఉన్నా.. రెండు వైపులా వారధిలా పనిచేయడమే గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ఉద్దేశమని వివరించారు.

ఎన్నికల సమయంలో మాత్రమే కాదు.. నిరంతర అనుసంధానం

సాధారణంగా ఎన్నికల సమయంలో ఎన్ఆర్ఐలు స్వదేశానికి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆర్థికంగా సహకరించడం, ఎన్నికలు పూర్తయ్యాక తిరిగి విదేశాలకు వెళ్లిపోవడం జరుగుతుందని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. ఇకపై ఆ విధానం మారాలని గురురాజా అన్నారు.

ఎన్ఆర్ఐలను బూత్ స్థాయి వరకు అనుసంధానం చేసే ఆలోచన ఉందన్నారు. ఒక ఎన్ఆర్ఐ ఏ ప్రాంతానికి చెందినవాడు, అతని స్వగ్రామం ఏది, అక్కడి రాజకీయ, సామాజిక సంబంధాలు ఏమిటి వంటి సమాచారాన్ని సమన్వయపరిచి.. అతడిని తన ప్రాంతంతో నిరంతరం అనుసంధానించే వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో విదేశాల్లో ఉన్న వ్యక్తి తన స్వగ్రామంలోని ప్రజలు, స్థానిక కార్యకర్తలు, పరిచయ వర్గాలతో నిరంతరం అనుసంధానమై ఉండే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.

మాతృభూమితో అనుబంధం

విదేశాల్లో ఎంత సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ మాతృభూమిపై ఉండే అనుబంధం ప్రత్యేకమైనదని గురురాజా అన్నారు. తాను అమెరికా వెళ్లిన కొన్ని సంవత్సరాల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చినప్పుడు అక్కడి వాతావరణం, వాసన కూడా స్వదేశాన్ని గుర్తుచేసి ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాయని చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ.. స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులు, స్నేహితులతో, పల్లెటూరి వాతావరణంలో గడపడం ప్రవాసాంధ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.

ఈ మాతృభూమిపై ప్రేమను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్ఆర్ఐ పెట్టుబడులకు ప్రత్యేక మ్యాచింగ్ ప్లాట్‌ఫామ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు స్పష్టమైన వ్యవస్థ అవసరమని గురురాజా చెప్పారు. పెట్టుబడి పెట్టే వ్యక్తికి ప్రధానంగా రెండు సందేహాలు ఉంటాయని తెలిపారు.

తాను సరైన వ్యక్తికి పెట్టుబడి ఇస్తున్నాడా?
తాను ఎవరిని సంప్రదించాలి?
ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా ప్రత్యేక మ్యాచింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందన్నారు. ఒకవైపు పెట్టుబడి అవసరమైన వ్యక్తులు, సంస్థలు, ప్రాజెక్టుల వివరాలు.. మరోవైపు పెట్టుబడి పెట్టాలనుకునే ఎన్ఆర్ఐల వివరాలు ఉంటే రెండింటినీ అనుసంధానం చేయవచ్చన్నారు. ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో కూర్చొని తన స్వగ్రామం పేరును నమోదు చేస్తే.. ఆ ప్రాంతంలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, అవసరమైన పెట్టుబడి, పెట్టుబడి పెట్టగల రంగాలు వంటి సమాచారం అందే విధంగా వ్యవస్థను రూపొందించాలన్నది తన ఆలోచనగా వివరించారు.

ఏపీ ఎన్ఆర్టీతో తేడా

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ, ఏపీ ఎన్ఆర్టీ రెండూ ప్రవాసాంధ్రుల కోసం పనిచేస్తున్నప్పటికీ వాటి పాత్రల్లో తేడా ఉందని గురురాజా తెలిపారు.

ఏపీ ఎన్ఆర్టీ ప్రభుత్వ వ్యవస్థగా అన్ని వర్గాల ప్రజలకు సేవలందిస్తుందని.. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ మాత్రం పార్టీ ఆధారిత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. అంటే ప్రభుత్వ స్థాయిలో ఏపీ ఎన్ఆర్టీ పనిచేస్తే.. పార్టీ పరంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుందని వివరించారు.

ఎన్టీఆర్ నుంచి లోకేష్ వరకు.. నాలుగు దశాబ్దాల ప్రయాణం

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడిగా తనకు బాధ్యత రావడానికి వెనుక దాదాపు నాలుగు దశాబ్దాల టీడీపీ ప్రయాణం ఉందని గురురాజా చెప్పారు. 1982లో ఎన్టీఆర్‌తో ఏర్పడిన అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఒక సమావేశానికి రాత్రి సమయంలో రావాల్సి ఉండగా.. తెల్లవారుజామున కూడా వేలాది మంది ప్రజలు అక్కడే వేచి ఉన్న సంఘటనను వివరించారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ చూపిన కమిట్మెంట్ తనను ప్రభావితం చేసిందన్నారు. 1983 ఎన్నికల సమయంలో డోన్ ప్రాంతంలో టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేసిన అనుభవాన్ని వివరించిన గురురాజా.. అనంతరం కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, కర్ర సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి తదితర నాయకులతో తన రాజకీయ ప్రయాణం కొనసాగిందన్నారు. 2013లో అమెరికాలో నారా లోకేష్‌ను కలవడంతో తన ప్రయాణంలో మరో కీలక దశ ప్రారంభమైందని తెలిపారు.

లోకేష్‌లో నచ్చినది కమిట్మెంట్

2013లో లోకేష్‌ను తొలిసారి కలిసిన సందర్భాన్ని గురురాజా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో లోకేష్ రాజకీయాల్లో కొత్తగా ఉన్నందున ఆయనతో కలిసి ప్రయాణించాలా వద్దా అనే సందేహం తనలో ఉన్నప్పటికీ.. లోకేష్ ప్రవర్తన తన అభిప్రాయాన్ని మార్చిందన్నారు.

ప్రయాణ సమయంలో తన సూట్‌కేస్‌ను కూడా లోకేష్ స్వయంగా తీసుకెళ్లిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. లోకేష్‌లో తనను ఆకట్టుకున్న ప్రధాన అంశం కమిట్మెంట్ అని గురురాజా అన్నారు. ఒకసారి మాట ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దానిపై నిలబడే స్వభావం తనకు కనిపించిందన్నారు. యువగళం పాదయాత్ర సమయంలోనూ తాను అమెరికా నుంచి పలుమార్లు వచ్చి ప్రత్యక్షంగా కాకుండా వెనుక నుంచి ఫీడ్‌బ్యాక్ అందించానని తెలిపారు. తన పని లోకేష్‌కు నచ్చిన విషయాలు మాత్రమే చెప్పడం కాదని.. మంచి అయినా, చెడు అయినా తనకు తెలిసిన విషయాలను నిజాయితీగా చెప్పడమేనన్నారు.

అయితే తుది నిర్ణయం మాత్రం నాయకత్వానిదేనని.. వివిధ వ్యక్తుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

వైద్య వృత్తిని వదిలి ప్రజా జీవితంలోకి ఎందుకు?

అమెరికాలో వైద్యుడిగా మంచి స్థాయిలో స్థిరపడినప్పటికీ.. అంతటి వైద్య వృత్తి, ఆదాయం, పేరు ఉన్నప్పటికీ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు రావాలనుకున్నారనే ప్రశ్నకు గురురాజా సమాధానమిచ్చారు.

చంద్రబాబు నాయుడితో ఒక ప్రయాణంలో జరిగిన సంభాషణను ఆయన గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకుండా వ్యాపార రంగంలో ఉంటే భారీ స్థాయిలో సంపాదించేవారని తాను సరదాగా చెప్పినప్పుడు.. ఒక సంతకంతో లక్షలాది మంది జీవితాలను, తరాల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం రాజకీయాల్లో ఉంటుందని చంద్రబాబు చెప్పారని గురురాజా వివరించారు. ఆ మాట తనపై ప్రభావం చూపిందన్నారు. అందుకే తనకు లభించిన బాధ్యతను పదవిగా కాకుండా బాధ్యతగా చూస్తున్నానని.. పార్టీ ఇచ్చే దిశానిర్దేశం ప్రకారం ఒక సైనికుడిలా పనిచేయాలన్నదే తన ఆలోచన అని చెప్పారు.

కుటుంబం కూడా అర్థం చేసుకుంటోంది

అమెరికాలో చాలా సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్నందున వెంటనే అన్నీ వదిలి రావడం సాధ్యం కాలేదని గురురాజా తెలిపారు. అయితే తన కుటుంబం కూడా ప్రస్తుతం తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటోందన్నారు. తన భార్య కూడా కొంతకాలం క్రితమే రాజకీయాల కోసం వృత్తిని వదిలి ఉంటే మరింత ముందుకు వెళ్లేవాడివేమో అని చెప్పిన విషయాన్ని ఆయన నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. తాను అమెరికాలో ఉన్నప్పటికీ తన మనసు ఎప్పుడూ స్వగ్రామం, స్నేహితులు, ప్రజలతో అనుసంధానమై ఉండేదన్నారు.

సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం

తన స్వగ్రామం కోయిలకుంట్లతో చాలా కాలంగా అనుబంధం ఉందని గురురాజా తెలిపారు. మెడికల్ కాలేజీ రోజుల నుంచే కులం, వర్గం అనే తేడా లేకుండా అందరి ఇళ్లకు వెళ్లి స్నేహాలు పెంచుకున్నానన్నారు. వైద్యుడిగా ఉన్న సమయంలోనూ తనను కలవడానికి ప్రజలు ఆసుపత్రికి వచ్చేవారని.. వివిధ సమస్యలతో సహాయం కోరేవారని చెప్పారు. స్నేహానికి తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని గురురాజా అన్నారు. చిన్ననాటి స్నేహితులతో ఏర్పడిన అనుబంధం జీవితాంతం కొనసాగుతుందని.. కష్టసుఖాల్లో స్నేహితులు అండగా ఉంటారనే నమ్మకం తనకు ఉందన్నారు.

కర్నూలు రాజకీయాల నాటి పరిస్థితులు

కర్నూలు ప్రాంతంలో గతంలో ఎన్నికల సమయంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను కూడా గురురాజా గుర్తుచేశారు. తన రాజకీయ ప్రయాణంలో కఠినమైన ఎన్నికల వాతావరణాన్ని చూశానన్నారు. ఒకప్పుడు ఎన్నికల ప్రచారంలో నాటు బాంబులు ఉన్న పరిస్థితుల్లోనూ ప్రయాణించిన రోజులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని రోజులు ఉండేవని వివరించారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గిపోయాయని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

అమరావతిపై ఎన్ఆర్ఐల ఆసక్తి

2019 నుంచి 2024 మధ్య అమరావతి పరిణామాలు, రైతుల ఉద్యమం, ప్రభుత్వంతో జరిగిన వివాదాలను కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా సాగుతున్న తీరుపై ఎన్ఆర్ఐలు ఆసక్తిగా చూస్తున్నారని గురురాజా తెలిపారు. అమరావతి భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడే స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని.. అందులో ఎన్ఆర్ఐలు కూడా తమ వంతు పాత్ర పోషించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల్లో గతంలో ఉన్న కొన్ని సందేహాలు ఇప్పుడు తగ్గుతున్నాయని.. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి పెరుగుతోందని ఇంటర్వ్యూలో తెలిపారు.

లక్ష నుంచి రెండు లక్షల యాక్టివ్ సభ్యుల లక్ష్యం

ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐ టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ.. అధికారికంగా సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉందని గురురాజా చెప్పారు. సభ్యత్వం తీసుకుంటే తమకు ఏమి ప్రయోజనం? తాము పార్టీకి ఎలా ఉపయోగపడగలం? అనే రెండు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వగలిగితే మరింత మంది సభ్యులుగా చేరుతారని అన్నారు. ప్రస్తుత సభ్యత్వాన్ని పెంచుతూ ముందుగా ఒక లక్ష మంది సభ్యులను.. ఆ తర్వాత రెండు లక్షల మంది యాక్టివ్ సభ్యులను తయారు చేయాలనే లక్ష్యాన్ని వివరించారు.

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీకి ఐదు ప్రధాన లక్ష్యాలు

గురురాజా తన ముందున్న ఐదు ప్రధాన లక్ష్యాలను వెల్లడించారు.

మొదటిది — ప్రవాసాంధ్రులకు పార్టీ విధానం, పార్టీ ఆలోచనను స్పష్టంగా తెలియజేయడం. ఎన్ఆర్ఐలకు పార్టీ వ్యవస్థలో తమ పాత్ర ఏమిటో స్పష్టత కల్పించడం.

రెండోది — ఎన్ఆర్ఐ టీడీపీని బలమైన సంస్థాగత శక్తిగా అభివృద్ధి చేయడం. పదవులు అడిగి గుర్తింపు పొందడం కాకుండా.. తమ పనితీరు ద్వారా గుర్తింపు పొందే స్థాయికి సంస్థను తీసుకెళ్లడం.

మూడోది — ఎన్ఆర్ఐలకు సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు తీసుకురావడం.

నాలుగోది — పెట్టుబడులు, సమస్యల పరిష్కారానికి అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్ఆర్ఐలకు సరైన సమాచారం, సరైన వ్యక్తులతో అనుసంధానం కల్పించడంతో పాటు స్వదేశంలో ఎదురయ్యే సమస్యలకు సహాయం చేయడం.

ఐదోది — పార్టీతో ప్రవాసాంధ్రుల అనుబంధాన్ని దీర్ఘకాలంగా కొనసాగించే రోడ్‌మ్యాప్ రూపొందించడం. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా.. నిరంతరం పార్టీతో, స్వగ్రామంతో, రాష్ట్ర అభివృద్ధితో ఎన్ఆర్ఐలను అనుసంధానం చేయడం.

అమెరికాలోని తెలుగు సంస్థలతో సమన్వయం

అమెరికాలో తానా, నాట్స్ వంటి అనేక తెలుగు సంస్థలు ఉన్న నేపథ్యంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ వాటితో ఎలా పనిచేస్తుందనే ప్రశ్నకూ గురురాజా సమాధానం ఇచ్చారు. అందరితో సమన్వయం ఉండాలని.. వ్యక్తుల ఆధారంగా కాకుండా సంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది తన విధానమని తెలిపారు.

“వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం” అనే విధంగా వ్యవస్థను నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఐ టీడీపీలో గతంలో ఉన్న గ్రూపులు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, ఈగోలను సమన్వయం ద్వారా తగ్గించవచ్చన్నారు. తనతో పాటు చాలా కాలంగా పార్టీ జెండాను మోసిన సీనియర్లను గౌరవించడం అవసరమని.. వారిని పక్కన పెట్టకుండా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.

త్వరలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక హెల్ప్‌లైన్

ప్రవాసాంధ్రుల కోసం త్వరలో ప్రత్యేక హెల్ప్‌లైన్ లేదా హాట్‌లైన్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందని గురురాజా తెలిపారు. కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, ఉద్యోగ సమస్య లేదా ఇతర ఇబ్బంది ఏదైనా వచ్చినప్పుడు ఒక నంబర్‌కు కాల్ చేస్తే అవసరమైన సహాయం లభిస్తుందనే నమ్మకం ఎన్ఆర్ఐల్లో కల్పించాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యత్వం కేవలం రాజకీయ గుర్తింపుగా కాకుండా.. ఒక సహాయక వ్యవస్థతో అనుసంధానం అయ్యేలా చేయాలనుకుంటున్నట్లు వివరించారు.

స్థానిక టీడీపీ నాయకులతో సమన్వయం

ఎన్ఆర్ఐలు స్వదేశానికి వచ్చినప్పుడు స్థానిక నాయకులతో సమన్వయం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే అపోహలు ఏర్పడే అవకాశం ఉందని గురురాజా అన్నారు. అందుకే స్థానిక ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో ముందుగానే సమాచారం పంచుకుని.. కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎన్ఆర్ఐల జాబితాను స్థానిక నాయకులకు అందించి.. వారితో సమన్వయం పెంచే ఆలోచన కూడా ఉందన్నారు. ఎన్ఆర్ఐ ఒక గ్రామంలోని పాఠశాలకు సహాయం చేయాలనుకుంటే.. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, సంబంధిత వర్గాలను కలుపుకుని కార్యక్రమం నిర్వహించే విధంగా పరస్పర సహకారం ఉండాలని వివరించారు.

జగన్ వ్యాఖ్యలపై వ్యక్తిగత అభిప్రాయం

ఇంటర్వ్యూలో వైఎస్సార్‌సీపీ, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలపైనా ప్రశ్నలు వచ్చాయి. దీనిపై గురురాజా తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారు. రాజకీయ నాయకులు తీసుకునే ప్రతి నిర్ణయం సమాజానికి ఉపయోగపడుతుందా లేదా అనే అంశాన్ని ఆలోచించాలని అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని.. ప్రజావేదిక కూల్చివేత వంటి ఘటనలను ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే ఇవి తన వ్యక్తిగత రాజకీయ విశ్లేషణలేనని.. ఎవరినీ సలహా ఇవ్వడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

చంద్రబాబు పని విధానం తనపై ప్రభావం చూపిందన్న గురురాజా

చంద్రబాబు నాయుడు పని చేసే విధానం తనను ఎంతో ప్రభావితం చేసిందని గురురాజా తెలిపారు. ప్రయాణాల్లో కూడా సమయాన్ని వృథా చేయకుండా పత్రాలు చదవడం, ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేసుకోవడం, మంత్రులతో చర్చలు నిర్వహించడం వంటి విషయాలను ఉదాహరణగా చెప్పారు. చంద్రబాబు వ్యక్తిగత సంపద, పేరు లేదా పదవి కంటే సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తాను చంద్రబాబును ఒక “సామాజిక సాధువు”గా భావిస్తానని కూడా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నుంచి వచ్చిన కమిట్మెంట్, చంద్రబాబు నుంచి వచ్చిన ఆలోచనా విధానం కలయికగా నారా లోకేష్‌ను చూస్తున్నానని గురురాజా చెప్పారు.

కార్యకర్తగా.. సైనికుడిగా బాధ్యత నిర్వహిస్తా

ఇంటర్వ్యూ చివర్లో తన ముందున్న అసలు లక్ష్యం ఏమిటని అడిగినప్పుడు.. తనకు అప్పగించిన బాధ్యతను ఒక కార్యకర్తగా, ఒక సైనికుడిగా నిర్వహించడమే ముఖ్యమని గురురాజా చెప్పారు. పార్టీ ఇచ్చిన బాధ్యతను వ్యక్తిగత పదవిగా కాకుండా సంస్థాగత బాధ్యతగా చూస్తున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారికి అవసరమైన సమయంలో అండగా నిలవడం, వారి సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించడం, పెట్టుబడులు, సేవా కార్యక్రమాలకు మార్గం సుగమం చేయడం తన ప్రధాన లక్ష్యాలని వివరించారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు కేవలం అభిమానులుగా కాకుండా కార్యకర్తలుగా, కుటుంబ సభ్యులుగా మారాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లతో కలిసి ప్రయాణించడం తనకు దక్కిన అవకాశంగా భావిస్తున్నానని.. పార్టీ ఇచ్చే దిశానిర్దేశం ప్రకారం ముందుకు సాగుతానని గురురాజా తెలిపారు.

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ముందున్న కార్యాచరణ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, వారి సమస్యలకు అండగా నిలవడం, విదేశాల్లోనూ స్వదేశంలోనూ వారికి సహాయక వ్యవస్థను అందించడం, ఎన్ఆర్ఐ పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానం చేయడం, సేవా కార్యక్రమాలను విస్తరించడం, పార్టీతో ప్రవాసాంధ్రుల దీర్ఘకాలిక అనుబంధాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలు డాక్టర్ పిల్లారి శెట్టి గురురాజా ముందుంచిన ప్రధాన కార్యాచరణగా ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.