తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలి
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై నల్లగొండ, సూర్యాపేట, భోనగిరి యాదాద్రి జిల్లాల అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్..
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చడంలో ఉద్యోగులు ముందుండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణం ఆ దిశగా సాగుతోందని అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేస్తే కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం అభివృద్ధిలో అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సమాజానికి సవాల్ విసురుతున్న పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారని అందులో భాగంగానే హరితహారం ప్రారంభించారన్నారు. ఇప్పటి వరకు ఆరు విడతలుగా నిర్వహించుకున్న హరితహారంలో ఇప్పటివరకు అటవీశాఖకే పరిమితం అనుకున్న మొక్కల పెంపకాన్ని అన్ని శాఖలతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. 7వ విడత ప్రారంభం కానున్న హరితహారంతో పాటు పల్లెప్రగతి,పట్టణ ప్రగతి,సీజనల్ వ్యాధుల నివారణలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మూడు జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక గత పాలనకు భిన్నంగా ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు పారదర్శకంగా చేర్చేందుకు గడిచిన ఏడూ సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. జనాభాలో 70 శాతానికి పై చిలుకు ప్రజలు వ్యవసాయ రంగం పై ఆధారపడి ఉన్నారన్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే 24 గంటల నాణ్యమైన ఉచిత నిరంతర విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కృష్ణా,గోదావరి నదుల్లో మన వాటాను అందుబాటులోకి తెచ్చి కోటి ఎకరాల మాగాణాన్ని సాగులోకి తెచ్చారన్నారు. ఆ క్రమంలో నే గ్రామాల అభివృద్ధి పై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారన్నారు. 60 నుండి 70 సంవత్సరాలు గా వివిధ రకాల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగిందన్నారు. అటువంటి పరిస్థితిని గుర్తించిన మీదటనే పల్లెప్రగతి,పట్టణప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం కార్యక్రమం రూపొందించడమే కాకుండా విధులు,నిధులు సకాలంలో అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను రూపొందించిన అంశాన్ని ఆయన అధికారులతో ప్రస్తావించారు. ఉద్యోగులకు ప్రభుత్వం నెలవారిగా జీతాలు అందిస్తున్న తరహాలోనే పల్లెప్రగతి, పట్టణప్రగతిలకు నిర్ణిత సమయానికి నిధులు పంపిస్తున్నారన్నారు. అటువంటి కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధిపై కిందిస్తాయిలో అధికారులు తప్పుడు నివేదికలు రూపొందించకుండా చూడాలన్నారు. ఉన్నది ఉన్నట్లుగా నివేదికలు అందించాలని,పనులు పురోగతి లేని పక్షంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాన్ని మాత్రమే నివేదికలలో ఉండాలని ఎక్కడ తప్పు జరిగిన చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పల్లెప్రగతి,పట్టణప్రగతి కార్యక్రమాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారన్నారు. తాను కుడా గ్రామాల వారిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్ లు సైతం గ్రామాల వారి పర్యటనలు నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ప్రధానమైన పల్లె,పట్టణ ప్రకృతివనాల ఏర్పాటుతో పాటువైకుంఠదామలు,డంప్ యార్డ్లపై ఆయన మారుమూల గ్రామాలలోని గ్రామ కార్యదర్శులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి కానీ చోట త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పందుల పెంపకానికి పశుసంవర్ధక శాఖను సంప్రదించి పట్టణాలకు దూరంగా ప్రభుత్వ భూములకు తరలించాలన్నారు. నల్లగొండతో పాటు భోనగిరి యాదాద్రి,సూర్యాపేట జిల్లాలలోని పురపాలక సంఘాలలో మిషన్ భగీరధ నీటి సరఫరాను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారిగా అధికారులను వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి ఆరు విడతలుగా సాగిన హరితహారంతో పాటు మంచినీటి సరఫరా ,సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత లను ఆయన వివరించారు. అన్నింటికీ మించి ఏ గ్రామానికి సంబంధించిన డంప్ యార్డ్ ను ఆ గ్రామంలోనీ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేయడం విధిగా పెట్టుకోవాలని సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, భోనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి లతో పాటుఅదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ ,చంద్రశేఖర్, డి ఎఫ్ ఓ రాంబాబు, డిఆర్డిఓ కాళిందిని, జడ్పి సియిఓ వీరబ్రహ్మచారి,డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జిల్లా స్థాయి నుండి గ్రామస్థాయి వరకు అధికార యంత్రాంగం మంత్రి జగదీష్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.