October 10, 2026

Tsdreams

INDIAN NEWS NETWORK

సినీ తార‌ల మ‌ధ్య సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవం

▪️ ముఖ్య అతిథులుగా సినీ నటులు రాజీవ్ కనకాల, వితికా షేరు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి
▪️ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, కూచిపూడి నృత్యం ప్రత్యేక ఆకర్షణ

హైదరాబాద్ (మణికొండ): సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు మణికొండలో ఘనంగా జరిగాయి. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రమశిక్షణ, సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ వార్షికోత్సవ వేడుకల్లో సినీ ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.

సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చైర్మన్ లోహిత్ సిస్ట్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, నటి వితికా షేరు, మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిన్నారుల సమగ్ర వికాసం, విలువలతో కూడిన విద్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతిథులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

విద్యతో పాటు విలువలు ముఖ్యం: ప్రదీప్ కొండిపర్తి

మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ కొండిపర్తి మాట్లాడుతూ, సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. చైర్మన్ లోహిత్ సిస్ట్లాకు విద్యారంగంపై స్పష్టమైన దృక్పథం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగే ఆలోచన ఉన్నాయని ప్రశంసించారు. చిన్నారులకు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలు, నైతికతను నేర్పించేలా విద్యాసంస్థను తీర్చిదిద్దడం అభినందనీయమని పేర్కొన్నారు.

చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది: రాజీవ్ కనకాల

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, సిస్ట్లా స్కూల్ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. చిన్నారులకు అందించాల్సిన విద్య, వారిలో పెంపొందించాల్సిన నైపుణ్యాలపై తన అభిప్రాయాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపారు. అయితే, పాఠశాల రూపొందించిన ఆడియో-విజువల్ ప్రజెంటేషన్‌ను చూసిన తర్వాత, తాను చెప్పాలనుకున్న అనేక అంశాలు ఇప్పటికే పాఠ్యప్రణాళికలో భాగంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ రాబోయే 25 ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించి, ఎంతోమంది చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని ఆకాంక్షించారు.

చిన్నారుల ఎదుగుదలలో ప్రీ స్కూల్ విద్య కీలకం: వితికా షేరు

నటి వితికా షేరు మాట్లాడుతూ, పాఠశాలలో చిన్నారులను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల విద్య కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తన ఎదుగుదలలో తల్లి అందించిన ప్రోత్సాహం, చిన్నప్పటి నుంచి ఆమె చూపిన శ్రద్ధ ఎంతో దోహదపడ్డాయని గుర్తుచేసుకున్నారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం, సమగ్ర ఎదుగుదలలో ప్రీ స్కూల్ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొంటూ, సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చేస్తున్న కృషిని అభినందించారు.

చిన్ననాటి ఆలోచనలే పాఠశాల ఏర్పాటుకు ప్రేరణ: లోహిత్ సిస్ట్లా

స్కూల్ చైర్మన్ లోహిత్ సిస్ట్లా మాట్లాడుతూ, తన చిన్ననాటి అనుభవాలే ఈ విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులకు అనుగుణంగా విద్యను అభ్యసించే అవకాశం ఉంటే బాగుండేదని భావించేవాడినని చెప్పారు. ఆ ఆలోచనతోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, చిన్నారుల ఆసక్తులు, సామర్థ్యాలకు తగిన విధంగా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్‌ను ప్రారంభించినట్లు వివరించారు.

ఇతర వ్యాపారాలతో పాటు ఈ విద్యాసంస్థ తనకు ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. తొలి వార్షికోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు

కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మోఘోష్, విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వ్యాఖ్యాత నిహారిక తనదైన శైలిలో కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నిర్వహించారు. నృత్య నిర్వాహకురాలు శోభ గోపు ఆధ్వర్యంలోని కౌస్తుభ కూచిపూడి బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు, అతిథుల సందేశాలతో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.